ఖమ్మం-నల్గొండ సరిహద్దు ప్రాంతమైన పైనంపల్లి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనను అడ్డుకొని, ఆమెను ఆరెస్ట్ చేసినందుకు నిరసన తెలిపేందుకు ఆ పార్టీ నేతలు డీజీపీ ప్రసాదరావుని కలవనున్నారు. పోలీసు చర్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. పబ్బం గడుపుకోవడానికే తెలంగాణ మంత్రులు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సమైక్య చాంపియన్ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో వారు ఉండటం సిగ్గుచేటన్నారు. మంత్రులు వెంటనే రాజీనామాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మీరు తెలంగాణకే మంత్రులా? రాష్ట్రానికి మంత్రులా? అని వారు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు లేని ఇబ్బంది, నల్గొండ జిల్లాలో పర్యటిస్తే ఎలా వస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ అడిగారు.