కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నంచేశారు. కార్యకర్తలు అడ్డుకుంటున్నా పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి నేతలు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్, మాజీ మేయర్ పి. రవీంద్రనాథ్ రెడ్డి, హఫీజుల్లా, అల్లాడు పాండురంగారెడ్డి, సంపత్ కుమార్లు ఏడు రోజుల నుంచి ఆమరణదీక్ష చేస్తున్నారు. రాత్రి 8 గంటల సమయంలో దాదాపు 20 మంది పోలీసులు ఒక్కసారిగా శిబిరం వద్దకు వచ్చారు. దీక్ష చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. దీక్షలో ఉన్న నేతలు, కార్యకర్తలు అందుకు అంగీకరించలేదు. అడ్డుకోవడానికి ప్రయత్నించినా పోలీసులు నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసులు దీక్ష చేస్తున్నవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. వారి ఆరోగ్యం క్షీణించడంతో అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసినా తమ దీక్షను కొనసాగిస్తామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరి కొందరు నేతలు దీక్షను కొనసాగిస్తామని చెప్పారు. రేపటి నుంచి దీక్షలో కూర్చునేందుకు కొందరు నేతలు సిద్ధమయ్యారు.