కొత్త పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గడిచిన రెండున్నర ఏళ్లలో ఒక భారీ ప్రాజెక్టును కూడా ఆకర్షించకపోగా ఉన్న పరిశ్రమలే మూతపడుతున్నాయి. రాష్ట్రంలో తగ్గుతున్న పారిశ్రామిక విద్యుత్ వినియోగమే ఇందుకు నిదర్శనం. ఈ రెండేళ్లలో విశాఖపట్నం నుంచి హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ వెళ్లిపోగా, మన్నవరంలోని బీహెచ్‌ఈఎల్‌కు చెందిన విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రం కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. వాస్తవ పరిస్థితులిలా ఉండగా రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువంటూ ప్రభుత్వం భారీ ప్రచారానికి తెర తీస్తోంది.