లోక్సభలో రాష్ట్ర విభజన ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శుక్రవారం లోక్సభ ప్రారంభం అయిన అయిదు నిమిషాలకే గంటపాటు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సమావేశాలను సజావుగా నడిపేందుకు సహకరించాలని స్పీకర్ మీరాకుమార్ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతోగందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. అంతకు ముందు పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు స్పీకర్ కార్యాయలంలో మీరాకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అసంతృప్తిగానే ముగిసింది. తెలంగాణ అంశం, కోల్‌స్కాం సహా ఇతరత్రా అంశాలపై నిత్యం సభలో గందరగోళం నెలకొంటున్న విషయం తెలిసిందే. ఉభయసభలు ఏ అంశంపై చర్చ జరగకుండానే వాయిదా పడుతున్నాయి. దీంతో మిగిలిన కొద్దిరోజులైనా సభను సజావుగా నడిపేందుకు అన్ని పార్టీల నేతలతో స్పీకర్ మీరాకుమార్ చర్చలు జరిపినా ఫలితం లేకపోవటంతో అఖిలపక్షం మరోసారి భేటీ కానుంది.