ఓటుకు నోటు కేసులో కీలక సాక్షి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కోర్టుకు బయల్దేరారు. ఈ కేసులో తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట ఇచ్చేందుకు ఆయన బోయిగూడ లోని తన నివాసం నుంచి నాంపల్లి లోని ఏసీబీ కోర్టుకు బయల్దేరారు. పోలీసులు ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో ఆయనను పటిష్ఠమైన భద్రత నడుమ కోర్టుకు తరలించారు. ఈ కారులో స్టీఫెన్సన్ ఒక్కరే బయల్దేరారు. 15-20 మంది వరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ముందుగానే దారి మొత్తం భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కేసులో స్టీఫెన్సన్ వాంగ్మూలం అత్యంత కీలకం కావడంతో అంతా దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యాయమూర్తికి ఆయన చెప్పే విషయాలు కేసు దర్యాప్తులో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి.