కేంద్రప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చిందని, దాంతో అవినీతి తగ్గడం కాకుండా మరింత ఎక్కువవుతుందని సీపీఎం అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చలో బుధవారం మధ్యాహ్నం ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. అసోంలో ఉప ఎన్నిక ఉంది కాబట్టే అక్కడ టీ కార్మికులకు మినహాయింపు ఇచ్చారని, ఇతర ప్రాంతాల్లో ఇది ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం స్వీడన్‌లో మాత్రమే పూర్తిగా నగదు రహిత వ్యవస్థ ఉందని, అక్కడ నూటికి నూరుశాతం ఇంటర్‌నెట్ విస్తృతి ఉంది కాబట్టి అందరూ తమ ఫోన్లు, ఐ ప్యాడ్ల సాయంతో చెల్లింపులు చేస్తారని.. కానీ మన దేశంలో అంత విస్తృతి ఎక్కడ ఉందని అడిగారు. ప్రధాని మోదీ ఇప్పుడు ఎవరినీ కరెన్సీ వాడొద్దని, అన్నిచోట్లా కార్డులే వాడాలని చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమని అన్నారు. 86 శాతం నగదును రద్దుచేసి.. కేవలం 14 శాతం నగదుపైనే వ్యవస్థ నడవాలంటున్నారని చెప్పారు.