జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కొత్త జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జిల్లాలో ఉన్న అధికారులు తమ పరిధిలోని కొత్త జిల్లాల్లో సంబంధిత విభాగాలకు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించాలని ఆదేశించింది. పరిపాలన గాడిలో పడేంత వరకు ఈ విధానాన్ని కొనసాగించే అవకాశముంది. ఇక అన్ని విభాగాలకు కొత్త జాబ్ చార్ట్‌లను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. కొత్త జిల్లాల పాలనకు వీలుగా అధికారులు, ఉద్యోగుల హోదాలు, పాలనా స్వరూపంలో మార్పులు చేస్తున్న నేపథ్యంలో జాబ్‌చార్ట్‌లను మార్చుతున్నారు. ఈ మేరకు అన్ని శాఖలు ఈ జాబ్ చార్టులను తయారు చేసేందుకు విభాగపరమైన వర్క్‌షాప్‌లు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక కొన్ని జిల్లా స్థాయి పోస్టులను రెండు, మూడు జిల్లాల పరిధికి విస్తరించేలా రీజినల్ స్థాయిగా మార్చే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. న్యాయ, చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతమున్న డివిజినల్ స్థాయి పోస్టులను పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనలను సైతం రూపొందించింది.