విజయవాడ దుర్గగుడిలో అత్యంత పవిత్రంగా నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివాదం తలెత్తింది. ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కృష్ణానదిలో హంస వాహనంపై దుర్గామల్లేశ్వరస్వామివార్లను ఊరేగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, దేవాదాయ శాఖ సిబ్బందికి మధ్య వివాదం చోటుచేసుకుంది.పోలీసులు కొబ్బరికాయ కొట్టకుండానే దేవాదాయ శాఖ సిబ్బంది అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు. దీంతో ఆగ్రహం చెందిన పోలీసులు ఊరేగింపును నిలిపివేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ... ఆలయ ఈవో సూర్యకుమారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. వన్టౌన్ ఎస్ఎస్వో పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే అమ్మవారి ఊరేగింపును ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈవో ఊరేగింపును ప్రారంభించారని చెప్పారు.