పార్లమెంటులో వాయిదాల పర్వం | Parliament Disrupted over Telangana, Adjourned Till Noon | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 12 2013 1:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM

తెలంగాణ సహా పలు అంశాలపై ఎంపీలు తీవ్రస్థాయిలో గళమెత్తడంతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పర్వాలతో నడుస్తున్నాయి. మూడు రోజుల విరామం అనంతరం సోమవారం సమావేశమైన పార్లమెంటు ఉభయ సభలు కొద్ది సేపటికే తొలుత మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడినా, మళ్లీ సమావేశమైన తర్వాత కూడా తెలంగాణ, తదితర అంశాలపై ఎంపీలు గట్టిగా పట్టుబట్టడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. లోక్సభ సమావేశం కాగానే ముందుగా కేరళలో సోలార్ స్కాం, జమ్ములో జరుగుతున్న మతఘర్షణలు, కర్ఫ్యూ తదితర పరిస్థితులు, తెలంగాణ, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూకుంభకోణం తదితర అంశాలపై పలు పార్టీలకు చెందిన ఎంపీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ముందుగానే చెప్పినట్లు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయాన్ని జరగనివ్వలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తీరాలంటూ నినాదాలు చేశారు. లోక్సభలో దివంగత సభ్యులకు నివాళులు అర్పించిన వెంటనే వామపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ రాజీనామా చేయాలని, సోలార్ స్కాంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోనియా అల్లుడు వాద్రాపై ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా చేసిన ఆరోపణలను బీజేపీ సభ్యులు ప్రస్తావించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. రాజ్యసభ మధ్యాహ్నం లోపు రెండుసార్లు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర విభజన అంశం, కేరళ సోలార్ స్కాం, జమ్ము అల్లర్లు లాంటి అంశాలన్నీ సమావేశాన్ని వేడెక్కించాయి. రాజ్యసభలో బీజేపీ పక్షనేత అరుణ్ జైట్లీని జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోకి అనుమతించకపోవడంపై జైట్లీ ఓప్రకటన చేస్తారని సీనియర్ ఎంపీ వెంకయ్య నాయుడు అన్నారు. దీంతో జైట్లీని మాట్లాడాలని చైర్మన్ హమీద్ అన్సారీ కోరినా, వామపక్ష సభ్యులు కేరళ అంశాన్ని గట్టిగా పట్టుకున్నారు. దీంతో అన్సారీ సభను పావుగంట వాయిదా వేశారు. తిరిగి సమావేశమనప్పుడు జైట్లీని మాట్లాడాలని కోరినా, అప్పటికీ పరిస్థితులు చక్కబడలేదు. టీడీపీ సబ్యులు సమైక్యాంధ్ర బ్యానర్లు పట్టుకుని వెల్లోకి దూసుకొచ్చారు. దీంతో అన్సారీ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి యథాతథంగా కొనసాగింది. దీంతో లోక్సభ, రాజ్యసభ రెండూ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement