కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిపై అనర్హత పిటిషన్ పై పార్లమెంట్ ప్రివిలెజ్ కమిటీ శుక్రవారం విచారణ చేపట్టింది. వైఎస్‌ఆర్ సీపీ తరపున గెలుపొంది ప్రమాణ స్వీకారం కంటే ముందే టీడీపీ కండువా కప్పుకున్న ఎస్పీవై రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విచారణకు వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీవై రెడ్డి అనారోగ్యం కారణంగా ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరు కాలేదని చెప్పారు. అయితే ఆయన సమర్పించిన అఫిడవిట్ లో ...తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపిందని, అఫిడవిట్ ఇచ్చారన్నారు. దానికి మీడియానే సమాధానం చెప్పాలని మేకపాటి అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఎస్పీవై రెడ్డి హాజరై...వివరణ ఇచ్చిన అనంతరం ఆ నివేదికను స్పీకర్ కు పంపుతారన్నారు. కాగా టీడీపీలో చేరినట్లు టీవీ, పత్రికల్లో వచ్చిన కథనాలు అవాస్తవమని ఎస్పీవై రెడ్డి అఫిడవిట్ ఇచ్చారు.