పెద్దనోట్ల రద్దుతో భారీగా లాభం జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయులను ప్రధాని మోదీ తుస్సుమనిపించారు. నోట్లరద్దు తర్వాత సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు కేంద్రం ప్రకటించిన 50 రోజుల గడువు పూర్తవడంతో దేశాన్ని ఉద్దేశించి శనివారం ప్రసంగించిన ప్రధాని మోదీ.. కొన్ని తాయిలాలు ప్రకటించడం మినహా ప్రజలకు భారీగా లబ్ధి చేకూర్చే ప్రకటనలేమీ చేయలేదు. రద్దు గాయంతో బాధపడుతున్న దేశ ప్రజలపై తాయిలాలతో పూత పూసే ప్రయత్నం చేశారు. కొత్త ఏడాదికి తీపికబురు అందుతుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. ఉసూరుమనిపించారు. త్వరలో యూపీ సహా ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అక్కడి ఓటర్లను ఆకర్షించేలా పలు పథకాలను ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగాన్ని తలపించిన మోదీ ప్రకటనలో రైతులు, మహిళలు, చిరు వ్యాపారులపై వరాల జల్లు తప్ప.. నోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం, విత్‌డ్రాయల్ పరిమితిని ఎప్పుడు ఎత్తేస్తారనే అంశాలపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.