వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ భారతీయ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూ ర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. మూడు వారాల్లో ఆరు రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆగష్టు 2న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డును తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని ఆగస్టు 2న పేర్కొంది.