జగనన్న ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి జీవం పోస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా షర్మిల చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించారు. బస్సు యాత్ర షెడ్యూల్‌లో పలమనేరు లేనప్పటికీ షర్మిలకు స్వాగతం చెప్పడానికి వేలాది మంది సమైక్యవాదులు తరలివచ్చారు. పలమనేరు వీధులు సమైక్యవాదులతో కిటకిటలాడాయి. ఇక్కడ షర్మిల మాట్లాడింది కొంచెంసేపయినా ఆమె ప్రసంగానికి పలమనేరు వాసులు జేజేలు పలికారు. జగనన్న సీఎం అయితే రాష్ట్రం కళకళలాడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజనకు కారకులపై షర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్ మంచి మనసు చూసే అమరనాథ్ రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వచ్చిన అమర్‌నాథ్ రెడ్డి అవినీతిపరుడు అంటూ టీడీపీ ఆరోపణలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.