వైసీపీలో చేరిన తమ్మినేని సీతారాం | Tammineni Sitaram joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 29 2013 12:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ సభ్యత్వం తీసుకున్నారు. విజయమ్మ ఈ సందర్భంగా తమ్మినేనికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలం అంటూ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని తమ్మినేని సీతారాం తప్పపట్టారు. విభజన విషయంలో బాబు కీలకపాత్ర పోషించడంపై ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తమ్మినేని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 1980లో తన 18వ ఏటనే సుగర్ ఫ్యాక్టరీ డెరైక్టర్‌గా పనిచేశారు. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొమ్మిదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వ విప్‌గా ఐదేళ్లు, శాప్ డెరైక్టర్‌గా మూడేళ్లు ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా 3 సార్లు పనిచేశారు. ఇంతటి సీనియర్ నాయకుడు పార్టీ నుంచి వెళ్లిపోవటంతో నాయకులు డీలాపడ్డారు. ఎవరు వెళ్లినా నష్టం లేదని పైకి అంటున్నా అది హృదయం నుంచి వచ్చిన మాటలా కాకుండా గొంతు నుంచి వచ్చిన పలుకులా ఉంది. పీఆర్‌పీ నుంచి వెనక్కి.. సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించాక తమ్మినేని అందులో చేరారు. ఎన్నికల తర్వాత పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని తెలియడంతో ఆ పార్టీని వీడి తిరిగి టీడీపీలో చేరారు. ఇప్పుడా పార్టీకీ రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement