రసకందాయంలో గన్నవరం రాజకీయం | Vallabhaneni Vamsi eye on Gannavaram constituency | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 21 2013 8:44 PM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు విజయా డెయిరీ డెరైక్టర్‌గా ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే చైర్మన్ పదవిపై దృష్టిసారించే అవకాశం ఉంది. ఆయనకు చైర్మన్ గిరి దక్కితే.. గన్నవరం ఎమ్మెల్యే సీటు ఎవరికి ఇస్తారనే అంశంపై జిల్లా, అర్బన్ తెలుగుదేశం పార్టీల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సీటుపై పార్టీ అర్బన్ మాజీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ (వంశీ) ఎప్పటి నుంచో ఆశపెట్టుకున్నారు. ఇప్పటివరకు తనకు పక్కలో బల్లెంలా ఉన్న వంశీ కోసం దాసరి సీటును వదులుకుంటారా? లేదా తన కుటుంబం నుంచే మరొకరిని రంగంలోకి దింపుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి వారసుల దృష్టి? తెలుగుదేశం పార్టీకి పట్టున్న గన్నవరం సీటుపై నందమూరి వారసులు దృష్టిసారిస్తున్నారు. ఎన్టీఆర్ తనయుడు, సినీనటుడు హరికృష్ణకు ఈ సీటు కేటాయిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అరుుతే, సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ ఎంపీ సీటును వదులుకోవడం, గుడివాడ నుంచి యాత్ర చేస్తానని ప్రకటించడం పార్టీ అధినేత చంద్రబాబును సందిగ్ధంలో పడేసింది. ప్రస్తుతం చంద్రబాబు, హరికృష్ణ మధ్య సఖ్యత లేకపోవడంతో ఆయనకు ఈ సీటుకు దక్కుతుందా? అనే అనుమానాలు పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతున్నారుు. దీంతో గన్నవరం నుంచి సినీనటుడు బాలకృష్ణ పోటీచేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. బాలకృష్ణ గత ఏడాదిగా కృష్ణాజిల్లా రాజకీయాలపై దృష్టి సారించారు. వాస్తవంగా ఆయన గుడివాడ నుంచి పోటీ చేస్తారని తొలుత అందరూ భావించారు. అయితే, అక్కడ వైఎస్సార్ సీపీ నేత కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ను ఢీకొనడం అంటే ఇబ్బందేన ని జిల్లా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గన్నవరం సీటు అయితే కచ్చితంగా గెలవవచ్చని లెక్కలేస్తున్నారు. వల్లభనేని వంశీమోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు(ఉమ) మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణను గన్నవరం నుంచి పోటీకి దింపితే వంశీమోహన్‌కు కూడా చెక్ పెట్టినట్లు ఉంటుందని పార్టీ నేతలు భావిసున్నట్లు సమాచారం. అయితే, బాలకృష్ణను ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు చంద్రబాబు ఎంతమేరకు అంగీకరిస్తారనేది ప్రశ్న. వంశీకి సీటు దక్కేనా? యూత్ ఐకాన్‌గా గుర్తింపుపొందిన వంశీమోహన్‌కు చంద్రబాబు గన్నవరం సీటు కేటాయిస్తారా, లేదా అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఎంత నమ్మకంగా పనిచేసినప్పటికీ ఆయన్ను దూరంగా పెట్టడానికే బాబు ప్రయత్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లోనే ఆయన గన్నవరం సీటుకు పోటీ పడ్డారు. చివరి నిమిషంలో విజయవాడ పార్లమెంట్ సీటు కేటాయిచారు. ఈ ఎన్నికల్లో ఓడిన తర్వాత అర్బన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్లమెంట్ పరిధిలో ఆరు నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా యూత్‌ను ఆకర్షించి, విజయవాడ రాజకీయాలపై తన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. నగరంలో బలపడుతున్నాడనే సమయంలో అర్బన్ అధ్యక్ష పదవి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి ఆయనను తప్పించి, రాష్ట్ర పార్టీలో సాధారణ పదవికి మాత్రమే పరిమితం చేశారు. ప్రస్తుతం నగరంలో వంశీ మార్కు లేకుండా చెరిపేసేందుకు అర్బన్, జిల్లా నాయకులు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. గతంలో వంశీ నియమించిన తెలుగు విద్యార్థి అధ్యక్షుడు వడ్లమూడి మోహన్‌ను హత్యచేసిన నిందితుడిని చంద్రబాబు తన వాహనంలో ఎక్కించుకోవడమే ఇందుకు ఉదాహరణ. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చంద్రబాబు వంశీని దూరంగా ఉంచుతున్నారని పార్టీలోని కొందరు నేతలు పేర్కొంటున్నారు. జిల్లా పార్టీకి చెందిన కొందరు నేతలు వంశీకి వ్యతిరేకంగా చెప్పటం వల్లే బాబు ఆయన్ను దూరంగా ఉంచుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు గన్నవరం సీటు కేటాయిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement