భారీగా పెరిగిన రెగ్యులర్ చార్జీలు, రకరకాల సర్దుబాటు చార్జీలతో విపరీతమైన భారాన్ని మోస్తున్న విద్యుత్ వినియోగదారులపై మరింత భారం పడనుంది. గత ఆర్థిక సంవత్సరం (2012-13) నాలుగో త్రైమాసికానికి డిస్కంలు ప్రతిపాదించిన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్)కు అనుమతినిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారం 2012-13 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో వాడుకున్న కరెంటుకు సర్దుబాటు చార్జీల రూపంలో ప్రతి యూనిట్‌కు 49.14 పైసల చొప్పున డిస్కంలు వసూలు చేస్తాయి. తద్వారా విద్యుత్ వినియోగదారులపై రూ. 542.12 కోట్లు భారం పడనుంది. ఇందులో గృహ వినియోగదారుల నుంచి రూ.177 కోట్లు, మిగిలినది పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి వసూలు చేస్తారు. - 2009-10 సర్దుబాటు చార్జీల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. - 2010-11, 11-12 సర్దుబాటు చార్జీల వడ్డన గత ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమైంది. 2014 సెప్టెంబర్ వీటిని వసూలు చేస్తారు. - 2012-13 రెండో త్రైమాసికం సర్దుబాటు చార్జీల వసూలు ఏప్రిల్‌లో ప్రారంభమై జూన్‌తో ముగిసింది. మూడో త్రైమాసికం చార్జీలను జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వసూలు చేయాలని ఇప్పటికే ఈఆర్‌సీ ఆదేశాలు జారీచేసింది. 4వ త్రైమాసికం వడ్డనలను తాజా ఈఆర్సీ ఆదేశాల ప్రకారం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వసూలు చేస్తారు. - 2013 ఏప్రిల్ 1 నుంచి సర్దుబాటు చార్జీలను రద్దు చేస్తున్నట్లు ఈఆర్సీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.