ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత వాసుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసరంగా భయాందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మండిపడ్డారు. ఇప్పుడు రాకెట్ లాంచర్ల ప్రస్తావన ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. వాటి పేరుతో సచివాలయ నిర్మాణ వ్యయ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారన్నారు. ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని రేపు ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డం పెట్టుకోడానికి మొట్టమొదటగా ఆయన రాకెట్ లాంచర్లతో ప్రారంభించడం దారుణమని వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇదే ముఖ్యమంత్రి, తాను గెలవగానే టీడీపీ కేడర్‌ను ఉద్దేశిస్తూ.. తాను పదేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటానని చెప్పారని, తెలంగాణలో టీడీపీని గెలిపించి విజయవాడ వెళ్తానన్నారని.. కానీ గట్టిగా రెండేళ్లు కూడా పూర్తిచేయకుండానే హడావుడిగా విజయవాడకు ఎందుకు పరుగులు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజానికి ఆయన రాష్ట్రంలో ఉండే రాష్ట్రాన్ని పాలించడం తమకూ సంతోషకరమేనని.. అభ్యంతరం ఏమీ లేదని అన్నారు. కానీ.. కుర్చీలు, ఫ్యాన్లకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో అప్పుడే ఎందుకు తాత్కాలిక భవనాలకు వెళ్లారని ప్రజలకు అనుమానంగా ఉందని చెప్పారు.