సీమాంధ్రలోని సమైక్య ఉద్యమం రైల్వే వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. విద్యుత్ జేఏసీ నిరవధిక సమ్మెతో మూడోరోజు మంగళవారం కూడా గ్రిడ్ నుంచి రైల్వేకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా షట్‌డౌన్ అవ్వడంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను మాత్రం డీజిల్ లోకోమోటివ్‌లతో నడిపించారు. అవీ సరిపోను లేక పలు రైళ్లను రద్దు చేశారు. దాంతో రైల్వే అధికారులు మంగళవారం పలు రైళ్లను రద్దు చేశారు. 12 ప్యాసింజర్ రైళ్లు, రెండు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లు, గోదావరి, విశాఖ, దురంతో, గరీబ్ రథ్, తిరుమల ఎక్స్ప్రెస్లు రద్దు అయ్యాయి. రైళ్లు రద్దు కావటంతో విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు విజయవాడ-విశాఖపట్నం మధ్య విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో గూడ్సు రవాణాను నిలిపివేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు, ఎరువులు, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల రవాణా స్తంభించిపోయింది.