కాంగ్రెస్ పార్టీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అండగా నిలిచి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని వైఎస్సార్ సీపీ నేత షర్మిల మండిపడ్డారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శించారు. ఎన్నికల రోడ్ షోలో భాగంగా జిల్లాలోని ముల్కలపల్లికి విచ్చేసిన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడకు హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రధాన ప్రతిపక్షంగా నిలవాల్సిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా నిలవటం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేసే ముందు మీ గుండెళ్లో ఉన్న వైఎస్‌ఆర్‌ను ఒక్కసారి గుర్తు తెచ్చుకొని సీలింగ్ ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండని షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేస్తున్న తాటి వెంకటేశ్వర్లును,ఖమ్మం ఎంపీ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె విన్నవించారు.