అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు, వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించే సంకల్పం ఉన్నదే వైఎస్ఆర్ సీపీ అని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్సిపి జనపథంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజాసంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి వైఎస్ఆర్ అని చెప్పారు. ఉచిత విద్యుత్, రుణమాఫీలు, బీమా సౌకర్యాలతో ఆయన రైతులకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో గ్రామంలో 15 మందికి మించి ఫించన్లు వచ్చేవి కాదని, అదికూడా 75 రూపాయలే వచ్చేవన్నారు. సత్యం రామలింగరాజుతో కలిసి తన కొడుకును చదివించుకునేందుకు ఫీజురీయింబర్స్మెంట్ కల్పించుకున్నారని విమర్శించారు. మెస్ ఛార్జీలు పెంచాలన్న విద్యార్థులను అరెస్ట్ చేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బాబు హయాంలో బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. 200 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకుడు చంద్రబాబు అన్నారు. వైఎస్ ఐదేళ్ల పాలనలో చేనేత కార్మికులకు ఏంతో చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు తన 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి నష్టమన్న చంద్రబాబు ఇప్పుడు ఇంటింటా ఉద్యోగం ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి బుట్టా రేణుక, ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిని గెలిపించాలని విజయమ్మ కోరారు.
Published Sun, Mar 23 2014 6:50 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement