తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నాయకులు రాజీనామా డ్రామాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీమాంధ్ర మంత్రులంతా తమ పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తామంటే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు, అధిష్ఠానం చెప్పిన మాట వింటామని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. మరి అసలు కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఇంతవరకు తన అభిప్రాయం ఎందుకు చెప్పలేదని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని.. పైగా ఇప్పుడు కొత్తగా రాయల తెలంగాణ అంటున్నారని ఆయన మండిపడ్డారు. అసలు రాయలసీమను విభజించే అధికారం వాళ్లకు ఎవరిచ్చారని అడిగారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం సరికాదని, ప్రజల హృదయాలతో ఆటలాడుకుంటారా అని ప్రశ్నించారు. ఆటలు కట్టిపెట్టి రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచించాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ప్రజలను మభ్యపెట్టడం సరికాదని, ఇది ఆపాలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేయొద్దని కాంగ్రెస్ నేతలకు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాను ఎప్పుడో రాజీనామా లేఖ ఇచ్చానని, ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.