సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల తొలి జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నటిగా, దర్శకనిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయనిర్మల గతేడాది జూన్ 27న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసంలో ఆమె తొలి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత విజయ నిర్మల విగ్రహాన్ని కృష్ణ, మహేశ్‌బాబు, నరేశ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. అనంతరం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు దంపతులు, మురళీమోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి, నమ్రత, సుధీర్ బాబు, పరుచూరి బ్రదర్స్, గల్లా జయదేవ్, తదితరులు పాల్గొన్నారు. ఘట్టమనేని అభిమానులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయ నిర్మల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.