నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి వరద జలాలను తరలించి కృష్ణా డెల్టాలో తాగు, సాగు నీటి కొరత తీర్చే ప్రాజెక్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు వైఎస్ జగన్ ఆయనతో సమావేశమయ్యారు. ఇదే రోజు అమిత్ షా పుట్టిన రోజు కావడంతో కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరగడం విశేషం. రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై సానుకూల చర్చ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.