‘టి20 మ్యాచ్‌లకంటే మరో రెండు వన్డేలే ఉంటే బాగుండేది’ భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా సారథి విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. కోహ్లి మాత్రమే కాదు ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానుల అభిప్రాయం సైతం బహుశా ఇదే కావచ్చు. సరిగ్గా వన్డే వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న తరుణంలో టి20 మ్యాచ్‌లు ఆడటం జట్టుకు పెద్దగా ప్రయోజనకరం కాకపోయినా పర్యటన సంప్రదాయాల్లో భాగంగా పొట్టి ఫార్మాట్ కూడా ఆడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారత్, ఆస్ట్రేలియా ధనాధన్ క్రికెట్‌లో తలపడబోతున్నాయి. తుది ఫలితం ఎలా ఉన్నా స్టార్ ఆటగాళ్లతో కూడిన ఇరు జట్లు ప్రేక్షకులకు మాత్రం మాంచి వినోదం పంచడం ఖాయమనిపిస్తోంది.