తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు. మూడో జాబితాలో 13 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. టీడీపీ కూడా పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో జాబితాలో సనత్ నగర్ స్థానం నుంచి పార్టీ నేత కూన వెంకటేశ్ గౌడ్‌కు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ ఆశిస్తున్న ఈ స్థానాన్ని టీడీపీ ప్రకటించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. నిజామాబాద్ రూరల్ నుంచి టికెట్ ఆశించిన టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావుకు ఈసారి మొండిచేయి ఎదురైంది. ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ రేకుల భూపతిరెడ్డికి ఆ సీటును కేటాయించారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కి చేరింది. ఇంకా ఆరు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మూడో జాబితాలో ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ముగ్గురు ఎస్టీలు, ఒక ఎస్సీకి సీట్లు దక్కాయి.