తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఆరు రోజులపాటు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేకపోతున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ శనివారం తెలిపారు. వచ్చే ఆగస్టు 11 నుంచి 16 వరకు నిర్వహించే ఈ క్రతువుపై చర్చించేందుకు తిరుమల అన్న మయ్య భవన్‌లో శనివారం పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం టీటీడీ చైర్మన్ ‘పుట్టా’మీడియాతో మాట్లాడుతూ.. మహాసంప్రోక్షణ నేపథ్యం లో ఆగస్టు 9వ తేదీ సా.6 గంటల నుంచి భక్తులను క్యూలైన్లు, వైకుంఠం కంపార్ట్‌మెంట్లలోకి అనుమతించబోమన్నారు. అప్పటివరకు క్యూలైన్లలో ఉన్న వారికే 10వ తేదీన శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. తిరిగి ఆగస్టు 17వ తేది ఉ.6 గంటల నుంచి భక్తులకు పునఃదర్శనం ప్రారంభమవుతుందన్నారు.