ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతలు తమ అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారు. ముఖ‍్యంగా బీజేపీ నేత సాక్షి మహారాజ్ తాను 'సన్యాసి' గనుక తనకు ఓటు వేయని వారిని శపిస్తానని బెదింరించారు. తాజాగా కేంద్రమంత్రి మేనకా గాంధీ ఇలాంటి బెదిరింపులకు దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న మేనక ఎన్నికల ప్రచారంలో ముస్లింలనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషానివ్వదంటూనే...తనకు ఓటు వేయాలో లేదో నిర్ణయించుకోవాలన్నారు. అలాగే తనకు ఓటు చేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ ఈ నేపథ్యంలో వారికందాల్సిన సహాయం ఆధారపడి వుంటుందంటూ సభాముఖంగానే హెచ్చరించారు. మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చు పుచ్చుకోవాల్సిన వ్యవహారమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది.