మాడ్రిడ్: కరోనా రక్కసి మృత్యు క్రీడతో అల్లాడుతున్న స్పెయిన్‌లో ఓ స్ఫూర్తిమంతమైన సన్నివేశం చోటుచేసుకుంది. కోవిడ్ బారినపడినవారిని ఉచితంగా ఆస్పత్రికి చేరుస్తూ ఓ ట్యాక్సీ డ్రైవర్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే, అతని సేవలను గుర్తించిన ఓ ఆస్పత్రి యాజమాన్యం వినూత్నంగా స్వాగతం పలికింది. రికవరీ పేషంట్‌ను తీసుకువెళ్లాలంటూ అతన్ని రప్పించిన ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ (నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పడం) ఇచ్చారు.
దాంతోపాటు మనీ ఎన్వలప్‌ను అందించారు. అనూహ్య సంఘటనతో ట్యాక్సీ డ్రైవర్ ఆశ్చర్యం, ఆనందాలకు లోనయ్యాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా 23 లక్షలకు పైగా జనం కోవిడ్-19 బారిన పడగా.. 1,61,191 మంది మృతి చెందారు. ఆరు లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. 20,639 మరణాలతో స్పెయిన్ మూడో స్థానంలో ఉండగా.. 39,015 మృతులతో అమెరిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 23,227 మరణాలతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 77,357 మంది కోలుకున్నారు.