కడుపు మండి ఓ రైతు పెట్టిన వీడియో అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏం చేయాలో తోచక ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆ వీడియో సారాంశం అతని మాటల్లోనే.. ‘‘నాపేరు రాజా. నేను గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతును. నాకు వారసత్వంగా ఎకరా భూమి సంక్రమించింది. గతేడాది మరో 22 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేస్తే తెగులు వచ్చి మొత్తం పోయింది. అయితే పంట కోసం నేను చేసిన అప్పు రూ. 8 లక్షలు ఇప్పటికి వడ్డీతో సహా రూ. 10 లక్షలయింది. నా ఎకరా భూమి అమ్మి అప్పు తీర్చేద్దామని గత ఏడాది మే 13న స్థానిక సర్వేయర్‌కు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికి పదిసార్లు నన్ను కార్యాలయం చుట్టూ తిప్పుకుని నానా ఇబ్బందులకు గురిచేశారు. అయినా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు." అంటూ వాపోయాడు.