బీజింగ్: మందు లేని మాయరోగం వచ్చిందంటే ఎవరు మాత్రం భయపడిపోరు? పైగా అది భయంకర అంటువ్యాధి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? కళ్ల ముందు అందరూ కనబడుతున్నా ఏ ఒక్కరూ ధైర్యం చేసి ముందడుగు వేయలేరు. అందరూ ఉన్న అనాథలా వారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందులోనూ ప్రాణాంతక కరోనా మహమ్మారి సోకిందంటే కళ్ల ముందు ప్రపంచం కూలిపోతున్నట్లు, కాళ్ల కింద భూమి చీలిపోతునట్లు అనిపించక మానదు ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా ఇలాంటి అనుభవాన్ని చవిచూడక తప్పలేదు. చైనాకు చెందిన ఓ యువతి బీజింగ్‌లోని షిజింగ్‌షాన్ వాండా ప్లాజాకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అటువైపు నుంచి వచ్చిన సమాధానం విని ఆమె గుండె పగిలేలా రోదించింది.
కారణం.. ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడమే! ఈ విషయం తెలియగానే ఆ యువతి ఉన్నచోటునే కుప్పకూలి హృదయ విదారకంగా ఏడ్చింది. తన దరిదాపుల్లోకి కూడా ఎవరూ రావద్దంటూ అరుస్తూ, పిచ్చిపట్టినదానిలా గుక్కపెట్టి ఏడ్చింది. దీంతో విషయం అర్థమై అక్కడున్న వాళ్లు ఆమె నుంచి దూరంగా పరుగెత్తారు. కాసేపటి తర్వాత గుండె రాయి చేసుకుని, దుఃఖాన్ని దిగమింగుకుని పీపీఈ కిట్లు ధరించి ఉన్న వైద్యాధికారుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. అనంతరం కాసేపటికే అంబులెన్స్ రావడంతో ఆస్పత్రికి వెళ్లింది. మరోవైపు వాండా ప్లాజాను అధికారులు మూసివేశారు. కాగా బీజింగ్‌లో జూన్ నెలలోనే 300 కొత్త కేసులు వెలుగు చూశాయి.