భార్య సరోజతో కలిసి టీ తాగుతున్న డీఎంహెచ్‌ఓ గంగావరప్రసాద్
సాక్షి, నల్లగొండ: ‘‘ఉద్యోగరీత్యా పెంచికల్‌దిన్నె, సూర్యాపేట, హుజూర్‌నగర్‌లో పనిచేసేటప్పుడు పిల్లలతో గడపడానికి సమయం సరిపోయేది కాదు. పిల్లల చదువులు, ఇతర విషయాలను నా సహచరిణి సరోజనే చూసుకునేది. ఏ చిన్నపాటి సమస్య వచ్చినా మా నాన్న వై.శ్రీరాంమూర్తి, భార్య సరోజతో కలిసి చర్చించి పరిష్కారం చేసుకుంటుంటాం. సరోజ సహకారంతోనే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలిగాను.’’ అని అంటున్నారు జిల్లా అధికారిగా తన సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వై.గంగావరప్రసాద్.
శనివారం ఆయన తన కుటుంబ విషయాలను ‘సాక్షి పర్సనల్ టైమ్’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..మాది మిర్యాలగూడ పట్టణం. నాన్న వై.శ్రీరాంమూర్తి రిటైర్డ్ ఎస్‌ఈ. అమ్మ వైడీ కల్యాణి గృహిణిగా ఉండేది. వారికి నేను ఏకైక సంతానాన్ని. నాన్న ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తుండడంతో నా విద్యాభ్యాసం మొత్తం నాలుగు జిల్లాలతో ముడిపడింది. ఆయనకు ఎక్కడ బదిలీ అయితే అక్కడికి వెళ్లాల్సి వచ్చేది.
ఎల్‌కేజీ నుంచి సెకండ్ క్లాస్ వరకు నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో, మూడవ తరగతి నుంచి 5వ తరగతి వరకు కృష్ణా జిల్లాలో, 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాలలో సాగింది. తిరిగి ఇంటర్మీడియట్ మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశాను. ఎంబీబీఎస్ హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాలలో, డీఎల్‌ఓ కాకతీయ మెడికల్ కళాశాలలో పూర్తి చేశాను.
1998లో నేరేడుచర్ల మండలంలో పెంచికల్ దిన్నె ప్రభుత్వ డిస్పెన్సరీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించాను. అనంతరం మిర్యాలగూడ పీపీ యూనిట్లో, వేములపల్లి మెడికల్ ఆఫీసర్‌గా, అనంతరం హుజూర్‌నగర్ వైద్యశాలకు ఈఎన్‌టీ స్పెషలిస్టుగా పదోన్నతిపై వెళ్లాను. అనంతరం నడిగూడెం ఎస్‌పీహెచ్‌ఓగా, సూర్యాపేట పీఓడీటీటీగా తదనంతరం 2018లో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా చేరాను. గత జనవరిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా(ఎఫ్‌ఏసీ) బాధ్యతలను స్వీకరించి ఎలాంటి ఒడిదుడకులూ లేకుండా జిల్లాఅధికారులు, సిబ్బంది సహకారంతో సర్వీసును పూర్తి చేసుకోవడం సంతృప్తినిచ్చింది.
1987జూన్‌లో వివాహం
విజయవాడకు చెందిన సరోజతో 1987లో వివాహం జరిగింది. మాకు ఇద్దకు సంతానం. కుమారుడు డాక్టర్ వై.కళ్యాణ్‌రాం ఎండీఎస్, కోడలు డాక్టర్ అక్షిత బీడీఎస్ ఇద్దరు కలిసి మిర్యాలగూడలో కళ్యాణ్ డెంటల్ క్లీనిక్‌ను నిర్వహిస్తున్నారు. వారికి ఒక సంవత్సరం వయస్సు కలిగిన తన్విక అనే అమ్మాయి ఉంది. మా అమ్మాయి వై.లిఖిత బీటెక్‌ను పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అమ్మాయికి వివాహం చేయాల్సి ఉంది.
భార్య సరోజ సహకారంతోనే..
నేను ఉద్యోగరీత్యా ఇతర పట్టణాలలో పనిచేయాల్సి వచ్చిన సమయంలో కుటుంబాన్ని మొత్తం సరోజనే చూసుకునేది. పిల్లల చదువులు, పోషణ, నా తండ్రి ఆలనాపాలనా మొత్తం ఆవిడే చూసుకోవడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులూ ఉండేవి కావు. ఇప్పటికీ నేను డ్యూటీకి వెళ్లేటప్పుడు టిఫిన్ బాక్స్ పెట్టి బ్యాగులో పెడుతుంది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేయడం వల్ల కొన్నిసార్లు ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యేది. అయినా ఇంటి సమస్యలను ఎంతో ఓపికతో నేను వచ్చాక నాతో చర్చించేది. నాకు ఆమె అందించిన సహకారంతో కుటుం బం తో పాటు సర్వీసులోనూ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పనిచేశాననని కచ్చితంగా చెబుతా.
అమ్మ చనిపోవడం బాధించింది
నేను ఎంబీబీఎస్ మూడవ సంవత్సరంలో ఉండగానే అమ్మ కళ్యాణి చనిపోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటన. నేను ఏకైక సంతానం కాబట్టి నాన్న బాగోగులు చూసుకోవడం కోసం మిర్యాలగూడలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఉద్యోగ రీత్యా వివిధ రకాల అవకాశాలు వచ్చినప్పటికీ నాన్నకోసం అన్నింటినీ వదులుకుని ఉండాల్సి వచ్చింది. అమ్మ ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇప్పటికీ అమ్మలేదనే బాధ నన్ను బాధిస్తుంది. నా సర్వీసులో పై అధికారులతోపాటు సిబ్బంది అందించిన సహకారాన్ని ఎన్నటికీ మరువలేను. వేలాది మందికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశాను. బెస్ట్ సర్జన్‌గా అప్పటి కలెక్టర్ పురుషోత్తంరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా జిల్లా ప్రజలకు సేవలందించడం మంచి సంతృప్తిని ఇచ్చింది.
రిటైర్డ్ కాగానే ఈఎన్‌టీ సర్జన్‌గా ప్రాక్టీస్
ఉద్యోగ విరమణ పొందిన తరువాత కూడా ప్రజలకు సేవలందించాలనే తలంపుతో మిర్యాలగూడలో ఈఎన్‌టీ సర్జన్‌గా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించాలని నిర్ణయించుకున్నాను. నిత్యం ప్రజల మధ్యలో ఉండి వైద్యసేవలందించడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment