Think
-
Pet lovers ఆహారం పెట్టేముందు ఆలోచించండి?! ఈ చట్టం తెలుసా?
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులతో పాటు విభిన్న రకాల పక్షులు వంటి మూగ జీవాలకు కొదవలేదు. అయితే వాటి సహజ జీవనాన్ని కొనసాగించడానికి అనువైన, అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదనేది వాస్తవ సత్యం. ఈ నేపథ్యంలో ఇలాంటి మూగజీవాలకు నగరవాసులు ఆహారం పెట్టడం అనేది సాధారణ అంశంగా మారింది. దయతో నగర పౌరులు వీధి కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి జీవులకు ఆహారం పెడుతున్నారు. ఇది మానవీయతకు నిదర్శనం అయినప్పటికీ చట్ట పరంగా, పర్యావరణ పరంగా కొన్ని పరిమితులు, నిబంధనలూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ అంశాలపైన నగరవాసులు దృష్టి కేంద్రీకరించారు. – సాక్షి, సిటీబ్యూరో మూగ జీవాల పట్ల కనికరంగా ఉండడం అనేది సాటి ప్రాణిగా, మనుషులుగా మన బాధ్యత. ఇందులో భాగంగా వీధిలో నివసించే జంతువులు.. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి జీవులు నిరాశ్రయంగా, ఆకలితో అలమటిస్తుంటాయి. నగరంలోని ఇలాంటి ప్రాణులకు నగరవాసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ఆహారం అందించడం అతి సహజంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐతే కుక్కలకు అన్నం పెట్టడం, పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం కూడా తరచూ కనిపించే దృశ్యం. అయితే నగరం, శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలతో కలసిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో సాధారణ సాధు జంతువులతో పాటు పలు సందర్భాల్లో వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఇలా అన్ని జంతువులకూ ఆహారం అందించడంలో చట్టపరంగా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.చట్టం ఏం చెబుతోంది.. మూగ జీవాలను కాపాడేందుకు భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూరిటీ టు యానిమల్ (పీసీఏ) యాక్ట్ – 1960 అమలులో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం జీవాలకు ఉద్దేశపూర్వకంగా హాని చేయడం నేరం. కానీ జీవాలకు ఆహారం పెట్టే విషయంలో ప్రత్యేకంగా నిషేధం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే, స్థానిక మున్సిపల్ చట్టాలు, గృహ సంఘాలు నిబంధనలు విధించవచ్చు. ఏ జీవాలకు ఆహారం వేయవచ్చు? సాధారణంగా మనుషులతో మమేకమై జీవనం కొనసాగిస్తున్న వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవాలకు ప్రజలు ఆహారం అందించవచ్చు. అయితే అది బహిరంగ ప్రదేశాల్లో కాకుండా, నివాస ప్రాంగణాల్లో ఇవ్వడం మంచిది. అనవసరంగా రోడ్లపై జంతువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో అధికంగా ఉండే ట్రాఫిక్‌కు ఇది అంతరాయంగా మారుతుంది. నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉండే పక్షులకు నీళ్లు, గింజలు వంటివి పెట్టవచ్చు. కాని అది ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర, అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆవులు, ఇతర జంతువుకు ఆహారం పెట్టే వారు రోడ్ల పైన కాకుండా సురక్షిత ప్రాతాల్లో పెట్టడం మంచిదని, అంతేకాకుండా ఆ జీవులు తినే ఆహారాన్ని మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.వన్యప్రాణుల పట్ల జాగ్రత్త.. నగరంలో అరుదుగా కనిపించినా, అటవీ ప్రాంతానికి శివార్లలో నివసించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జింకలు, పులులు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం ప్రకారం నేరం. అడవి జంతువులకు ఆహారం అందించడం, వాటిని ఆకర్షించేలా చేయడం, వాటి సహజ జీవన విధానాన్ని భంగపెట్టేలా చేయడం చట్టవిరుద్ధం. వీటిని ఉపేక్షిస్తే చట్టరిత్యా కఠిన చర్యలకు, శిక్షలకు గురికాక తప్పదు. అధిక సంఖ్యలో తారసపడే కోతుల వంటి వన్య ప్రాణులకు ఆహారం అందించకూడదు. దీని వల్ల అవి సహాజంగా ఆహారాన్ని సేకరించడం క్రమంగా కోల్పోవడమే కాకుండా సులభంగా లభించే ఆహారం కోసం జనావాసాల్లోకి వలసపడతాయి. ప్రమాదకరమైన విషసర్పాల వంటి ఇతర ప్రాణులకు ఆహారం ఇవ్వకూడదు. ముఖ్యంగా ప్రమాదకర వన్యప్రాణులను ఏ విధంగా ఆకర్షించినా వాటికి, మనుషులకు శ్రేయస్కరం కాదు. భద్రతకు భంగం కలగకుండా.. మూగజీవాల పట్ల మానవీయతతో ఉండటం, వాటి సంరక్షణకు మన వంతు బాధ్యతను అందించడం మంచి విషయమే.. కానీ మానవీయత పేరుతో మనం జంతువులకు ఆహారం పెడితే, అది ఇతరుల హక్కులను, భద్రతను హరించేలా ఉండకూడదు. చట్టాన్నీ, సమాజాన్నీ గౌరవిస్తూ, జంతు సంక్షేమం పట్ల మన బాధ్యతను సమతుల్యంగా నిర్వహించాలని నిబంధలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, గృహ సంఘాల నిబంధనలు పాటిస్తూ.. మనుషుల ప్రేమను, కనికరాన్ని సమర్థవంతంగా చాటుకోవాలని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు. -
'సీఎం పదవిని వదిలేద్దామనుకున్నా.. కానీ..?'
జైపూర్: సీఎం పదవిని వదిలేద్దామనుకున్నా.. కానీ అదే తనను వదలట్లేదని అన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలని చెప్పారు. 2018లో ఎన్నికల సందర్భంగా సీఎం పదవి కోసం సచిన్ పైలెట్ పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న గహ్లోత్.. ఈ మేరకు మాట్లాడారు. పార్టీ అధిష్ఠానానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. 'సీఎం పదవిని వదిలేయాలని అనుకున్నా.. కానీ నేను ఎందుకు వదలాలి? ఆ పోస్టే నన్ను వదలట్లేదు.హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఏదైనా అంగీకారమే. సోనియా గాంధీ నన్ను మూడు సార్లు సీఎంను చేశారు.' అని గహ్లోత్ అన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అశోక్ గహ్లోత్‌కు, సచిన్ పైలెట్‌కు మధ్య ఇటీవల మళ్లీ వార్ నడిచింది. కానీ అధిష్ఠానం మరోసారి చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. అయితే.. తాజాగా జైపూర్‌లో నిర్వహించిన సమావేశంలో.. మరోసారి కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎంను అని గహ్లోత్ తెలిపారు. 2030 విజన్‌కు పిలుపునిచ్చారు. బలమైన రాజస్థాన్‌ను నిర్మిద్దామని అన్నారు. '2030 గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు. విద్య, ఆరోగ్యం, విద్యుత్, నీరు, రవాణా, రహదారులు వంటి రంగాల్లో విశేషమైన సేవ చేశాను. ఎందుకు నేను మరోసారి ముందుకు పోకూడదు అనిపించింది.' అని గహ్లోత్ అన్నారు. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గహ్లోత్‌ను కూడా పోటీలో నిలిచారు. గహ్లోత్ కేంద్ర స్థాయిలో ఉంటే.. సచిన్‌ను రాష్ట్ర స్థాయిలో ప్రధాన నాయకునిగా మారనున్నారని పుకార్లు వచ్చాయి. అయితే.. రాజస్థాన్‌లో సీఎంగా తాను మాత్రమే ఉండాలని ఎమ్మెల్యేలు పట్టుబడగా.. తప్పక ఉండాల్సి వచ్చిందని గహ్లోత్ చెప్పారు. ఇదీ చదవండి: Nuh violence: హర్యానా అల్లర్లు.. బుల్డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్.. -
ఒక్కసారి ఆలోచించండి..
– ప్రతి ఖైదీలోనూ సత్ప్రవర్తన రావాలి – మీపై కుటుంబాలు ఆధారపడ్డాయని గుర్తించుకోండి – ఖైదీల సంక్షేమ దినోత్సవంలో ఏడీజే ఎస్.ఎస్.ఎస్ జయరాజ్ మదనపల్లె టౌన్ : ‘నేరం చేసి జైలుకు వచ్చామని కుంగి పోకండి. ఒక్కసారి ఆలోచించండి.. మీపై కుటుంబాలు ఆధార పడ్డాయని గుర్తించుకోండి. ప్రతి ఖైదీ మార్పు కోసం ప్రయత్నించాలి’ అని మదనపల్లె మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.ఎస్.ఎస్ జయరాజ్ తెలిపారు. స్థానిక స్పెషల్ సబ్‌జైలులో ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జైలుకు వచ్చినంత మాత్రాన అందరూ నేరస్తులే అని అనుకోవద్దన్నారు. కొన్ని అనివార్య కారణాలతోనో, తెలిసో తెలియకో తప్పులుచేస్తుంటారని పేర్కొన్నారు. జైళ్లకు వచ్చిన వారిలో 90 శాతం మంది పచ్చాత్తాప్పడి మార్పును కోరుతున్నారని తెలిపారు. ఎక్కువ కాలం జైల్లోనే ఉండి బెయిలు పొందలేని వారికి బెయిలు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కారన్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, వార్డుర్లు, కోర్టు సిబ్బంది నాగమణి, మహిత, న్యాయవాదులు పాల్గొన్నారు. -
రైతులు అధైర్య పడవద్దు
అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల భరోసా ఖానాపురం : వర్షాల తో నష్టపోయిన రైతు లు అధైర్య పడవద్దని రాష్ట్ర వ్యవసాయ సహాయ సంచాలకులు రాజారత్నం, అజయ్‌కుమార్‌ఘోష్ అన్నా రు. ఖానాపురం మండలంలో వర్షాలతో నష్టపోయిన పంటలను సోమవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశం మేరకు నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో పంటలు పరిశీలించామని చెప్పారు. తాము సేకరించిన వివరాల నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏఓ వసుధ, ఏఈఓ గాజుల శ్యాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్‌రావు, రైతులు బొప్పిడి పూర్ణచందర్రావు, మోహ¯ŒSరావు, కృష్ణారావు ఉన్నారు. దుగ్గొండిలో.. వర్షాలతో నష్టపోయిన పలు పంటలను వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనరేట్ అధికారుల బృందం సోమవారం పరిశీలించింది. మందపల్లి, చాపలబండ, అడవిరంగాపురం, పిల్లిగుండ్లతండా, రాజ్యతండా గ్రామాల్లో పత్తి, వరి పంటలను కమిషనరేట్ అధికారులు అజయ్‌కుమార్‌ఘోష్, రాజారత్నం పరిశీలించారు. అనంతరం గిర్నిబావిలో విలేకరులతో మాట్లాడుతూ పత్తి రైతులకు అపార నష్టం వాటిల్లిందన్నారు. నీరు నిలవడంతో తెగుళ్లు వ్యాపించాయన్నారు. నష్టం తీవ్రం కాకుండా మండలానికి ఒక అగ్రి డాక్టర్‌తోపాటు వ్యవసాయ అధికారులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. గ్రామాలవారీగా వ్యవసాయ అధికారులు, వీఆర్ఓలతో ప్రత్యేక కమిటీ వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట నర్సంపేట ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ దయాకర్ తదితరులు ఉన్నారు. -
మా సహనం బలహీనతగా అనుకోవద్దు
ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్లకు ప్రాధాన్యతే లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు వద్దనే మౌనం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సహోదర్‌రెడ్డి పరకాల : మా సహనాన్ని బలహీనతగా, చేతగాని తనంగా అనుకోవద్దని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముద్దసాని సహోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి అందరిని కలుపుకొని పోవాల్సిన నైతిక బాధ్యత ఉంది. పాత వాళ్లకు ఎలాంటి రిసీవింగ్ లేక ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఓపిక పడుతున్నాం. 2001 నుంచి పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు. వేరే పార్టీలో గెలిచినప్పటికీ పార్టీ బలోపేతం కోసం టీఆర్ఎస్లో చేరిన అభ్యంతరం చెప్పలేదన్నారు. కానీ పార్టీలో చేరినప్పటి నుం చి పాతవాళ్లకు గుర్తింపు లభించడం లేదన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని నాకే ఏం తెలియడం లేదు. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దనే మౌనంగా ఉంటున్నామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో పాత, కొత్తవారికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరకాల ను జిల్లా కేం ద్రంగా చేయడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. కనీసం రెవెన్యూ డివిజ¯ŒSగానైనా ఉండాలన్నారు. రెండు రాకపోతే పరకాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుందని సహోదర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
ప్రశాంతతే అతిపెద్ద లగ్జరీ..!
కార్లు, గాడ్జెట్లను లగ్జరీ వస్తువులుగా చూసే కాలం చెల్లి పోయింది. పరుగుల బతుకుల్లో ప్రశాతను కోరుకునే వారే ఎక్కువైపోయారు. సెలవుల్లోనూ, ఖాళీ సమయాల్లోనూ కారులో షికారుకెడదామన్న ఆలోచననూ వదిలేశారు. ఒంటరిగా ఓ గంట గడపడమే ఎంతో అపురూపంగా ఫీలవుతున్నారు. ఇప్పుడు భారతీయుల్లో సగానికిపైగా జనం ప్రశాంతతనే కోరుకుంటున్నారని సర్వేలు సైతం చెప్తున్నాయి. ఈ కాలంలో ఒంటరితనమే అత్యంత లగ్జరీ వస్తువు అని ఇటీవల జరిపిన ఓ సర్వే తేల్చి చెప్పింది. నేటితరం వ్యక్తిగత సమయం, స్వేచ్ఛ కోరుకుంటోందని ఓ సంస్థ చేపట్టిన గ్లోబల్ సర్వే చెప్తోంది. తైవాన్‌ల ప్రధాన టెక్ సంస్థ ఆసస్ (ASUS) నిర్వహించిన సర్వేలో భారతదేశంలో నలభై శాతం మంతి ప్రజలు స్వేచ్ఛగా, వారికి ఇష్టమైనట్లుగా సమయాన్ని గడపడం లగ్జరీగా భావిస్తున్నారని తెలుసుకున్నారు. మిలీనియల్ కన్జూమర్ గ్లోబల్ సర్వే లో భారతదేశం, అమెరికా, బ్రిటన్, రష్యా, ఇండోనేషియా సహా అయిదు ప్రాంతాల్లోని సుమారు 19 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసున్నవినియోగదారులు పాల్గొన్నారు. వీరిలో భారతదేశ ప్రజలు ఎక్కువగా ఒంటరితనాన్ని, స్వేచ్ఛగా గడపడాన్ని లగ్జరీగా భావిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. ప్రజల జీవితాల్లో 'టాబ్లెట్ల' పాత్ర గురించి తెలుసుకునేందుకు ఆసస్ (ASUS) సంస్థ సర్వే నిర్వహించింది. ఎటువంటివారు తమ టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు అన్న విషయంపై ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో... వ్యక్తుల స్వభావాలగురించి వెల్లడైంది. నేటితరం ప్రజలు కొత్త పంథాలో ఆలోచిస్తున్నారనీ, సమూహంలో ఉండేకంటే... తమకిష్టమైనట్లుగానూ, స్వేచ్ఛగానూ ఉండేందుకే ఇష్టపడుతున్నారని మొబైల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఎరిక్ హెర్మాన్సన్ తెలిపారు. ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు వ్యక్తిగత స్వేచ్ఛను, ఒంటరి సమయాన్ని లగ్జరీగా భావిస్తున్నట్లు తెలిపారు. రోజువారీ జీవితాన్ని ఆస్వాదించడంలో మొబైల్స్, టాబ్లెట్స్ వంటి వస్తువులు సహకరిస్తున్నాయని అరవై శాతం మంది చెప్తున్నట్లు సర్వే ద్వారా తెలుసుకున్నారు. టెక్నాలజీ కూడ రొటీన్ నుంచి ప్రశాంతతను అందిస్తున్నట్లుగా జనం భావిస్తున్నారంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలు, స్నేహ సంబంధాలకు దూరంగా ఉంటున్న స్పీడు యుగంలో... ఒంటరిగా, స్వేచ్ఛగా బతకడమే సౌఖ్యంగా భావించే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా మరోమారు వెల్లడైంది.