Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Indian army attacks Pakistan capital Islamabad1
పాక్‌ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్‌ తరలింపు

పాక్‌ ప్రధాని ఇంటి సమీపంలో భారత సైన్యం దాడితో భారీ పేలుళ్లు జరిగాయి. దాంతో ఇస్లామాబాద్‌లోని తన నివాసం నుంచి షెహబాజ్‌ షరీఫ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్‌ టార్గెట్‌గా భారత్‌ డ్రోన్లు, మిస్సైల్‌లతో దాడికి దిగింది. పాక్‌ మిస్సైల్‌లను గాల్లోనే కూల్చి వేసిన భారత సైన్యం. జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై 8 సూసైడ్‌ డ్రోన్లతో పాక్‌ దాడి చేయగా వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. జైసల్మేర్‌, అక్నూర్‌లో ఇద్దరు పాక్‌ పైలట్‌లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్‌ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం. లాహోర్ , సియాల్ కోర్టులో కౌంటర్ ఎటాక్‌కు దిగిన భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 14 మంది పాక్‌ సైనికులు హతమైనట్టు సమాచారం.S-400, L-17 సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసిన భారత్‌. జమ్మూ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాక్‌ దాడులు. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్‌ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను హై అలర్ట్‌ చేసిన భారత్‌ సైన్యం. వరుస డ్రోన్ దాడులతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇదిలా ఉండగా అమెరికా, యూకే, యూఏఈలతో టచ్‌లో భారత్‌. రంగంలోకి SZU-23, శిక ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌. తాజా పరినామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, CDSతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్‌ సింగ్ భేటీ అయ్యారు. రంగంలోకి భారత నౌకాధళం రంగంలోకి దిగిన భారత నౌకాధళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీ పోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత​ నుంచి మిస్సైల్స్‌, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్‌ కార్గో నౌకలను ద్వంసం చేసిన ఇండియన్ నేవీ. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్‌పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్‌ను వణికిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేతతాజా పరినామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ,గుజరాత్‌, రాజస్థాన్‌ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్‌తాజా పరినామాలతో ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ధ భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్ల మోహరింపు.మరోవైపు పాకిస్తాన్‌పై బలూచిస్తాన్‌ దాడిఓవైపు భారత సైన్యం, ఇండియన్ నేవీ జరుపుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్‌కు మరోవైపు నుంచి బలూచిస్తాన్‌ దాడికి దిగింది. పాక్‌ చమురు క్షేత్రాలపనా బలూచిల దాడులు. ఇదిలా ఉండగా పాక్‌పై భారత్‌ దాడులను బలూచి రేడియో హైలెట్‌ చేస్తోంది.పాక్‌ రక్షణ వ్యవస్థల కూల్చివేతపాక్‌లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్‌. సర్గోదా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించిన భారత్‌. భారత్‌ దాడులతో దిక్కు తోచని పాక్‌ బలగాలు.15 భారత సైనిక స్థావరాలపై గురిన్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్‌ బొక్కబోర్లా పడింది. భారత్‌లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్‌లాయ్, భుజ్‌ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అందుకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పాక్‌ క్షిపణులు, డ్రోన్లను తుత్తునియలు చేసింది. గురువారం మధ్యాహ్నం పాక్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్, సియాల్‌కోట్, లాహోర్, రావల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్‌లోని పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్‌ కొనుగోలు చేసిన హెచ్‌క్యూ–9 మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ యూనిట్లను హర్పీ కామికాజ్‌ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్‌ కూడా ధ్రువీకరించింది. ‘‘లాహోర్‌ సమీపంలో ఒక డ్రోన్‌ నేలకూలింది. గుర్జన్‌వాలా, చాక్వాల్, బహవల్‌పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అతోక్‌ ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయి’’ అని అంగీకరించింది. లాహోర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. ‘‘పాక్‌ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్‌–400తో పాటు ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ యూఏఎస్‌ గ్రిడ్‌తో పాక్‌ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం’’ అని సైన్యం ప్రకటించింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ రాడార్లు, వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది. యుద్ధ వాతావరణం భారత దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్‌లో సియాల్‌కోట్, కరాచీ, లాహోర్‌ సహా పలు ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్‌ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అమెరికా సూచించింది. పీఎంఓ భేటీ జరుగుతుండగానే!ఇస్లామాబాద్‌పై భారత్‌ దాడుల సమయంలో ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అర్ధంతరంగా నిలిపేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్‌ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయనను హుటాహుటిన పాతిక కి.మీ. దూరంలోని బంకర్‌లోకి తరలించినట్టు చెబుతున్నారు. పలుచోట్ల బ్లాకౌట్‌పాక్‌ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్‌సర్, హోషియార్‌పూర్, మొహాలీ, చండీగఢ్‌ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్‌ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి.

Operation Sindoor: India has successfully shot down three Pakistani fighter jets2
Operation Sindoor: యుద్ధం మొదలు

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్‌ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకుని అభాసుపాలైంది. బుధవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచీ భారత్‌పై ఎడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్‌ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర, సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నింటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే గాక మూడు పాక్‌ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఇద్దరు పాక్‌ పైలట్లను బందీలుగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు కీలక పాక్‌ నగరాలపై ఒకే రోజు రెండుసార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు తదితరాలను నేలమట్టం చేసింది. రెండు రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభవం రుచిచూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. మరోవైపు నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌక బాంబుల వర్షం కురిపించి 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టు సమాచారం. 1971 పాక్‌ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తొలిసారి. అంతేగాక ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్‌ వైపు కదులుతున్నట్టు చెబుతున్నారు. ఎల్లలు దాటిన ఉద్రిక్తతల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరువైపుల నుంచీ కాల్పుల మోతతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. పౌర లక్ష్యాలపై పాక్‌ సైన్యం విచక్షణారహిత కాల్పులకు తెగబడుతోంది. అందుకు మన సైన్యం దీటుగా బదులిస్తోంది. ఇరు దేశాల్లోనూ సరిహద్దు రాష్ట్రాలు ఎయిర్‌ సైరన్లు, బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. పలు విమానాశ్రయాలు మూతబడ్డాయి. ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా భద్రతా బలగాలను కేంద్రం ఆదేశించింది. సైనికులకు సెలవులు రద్దు చేశారు. కీలకమైన సైనిక తదితర మౌలిక వ్యవస్థల వద్ద రక్షణను కట్టుదిట్టం చేశారు. పాక్‌ అత్యంత అనాగరికంగా వ్యవహరిస్తోందంటూ కేంద్రం మండిపడింది. పౌర ఆవాసాలపై విచక్షణారహితంగా డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగిస్తూ హమాస్‌ ఉగ్ర సంస్థను తలపిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు దుయ్యబట్టాయి. జమ్మూ, పఠాన్‌కోట్, ఉద్ధంపూర్‌ల్లో పాక్‌ క్షిపణి, డ్రోన్‌ దాడి యత్నాలను పూర్తిగా తిప్పికొట్టినట్టు సైన్యం ప్రకటించింది. పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. సంయమనం పాటించాల్సిందిగా ఇరు దేశాలకూ సూచించింది.పేట్రేగిన పాక్‌ సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్‌ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్‌ ఫైటర్‌ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్‌ మొదలుకుని జమ్మూ కశ్మీర్‌ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి. శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్‌ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్‌ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్‌ఎస్‌ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది. మన ‘ఆకాశ్‌’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పాక్‌ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్‌ యుద్ధ విమానాన్ని ఎస్‌–400 వ్యవస్థ నేలకూల్చింది. వాటిలో రెండు జేఎఫ్‌–17, ఒక ఎఫ్‌–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్‌ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్, కరాచీ, రావల్పిండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్‌ తదితర నగరాల్లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్‌ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్‌ వారి్నంగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్‌)ను తుత్తునియలు చేసింది. పాక్‌ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.పలుచోట్ల బ్లాకౌట్‌ పాక్‌ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్‌సర్, హోషియార్‌పూర్, మొహాలీ, చండీగఢ్‌ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్‌ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి.

Chandrababu Govt Police Searches at Sakshi Editor Dhananjaya Reddy residence3
‘సాక్షి’పై కక్ష సాధింపు

సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, వేధింపులకు బరితెగిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుండటంతో కక్షకట్టి పోలీసులను ఉసిగొలిపి బెదిరింపులకు దిగుతోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఎమర్జెన్సీ నాటి దురాగతాలకు పాల్పడుతోంది. ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి విజయవాడ నివాసంలో గురువారం సోదాల పేరుతో బెదిరింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వ కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. కనీసం సెర్చ్‌ వారంట్‌ కూడా లేకుండా, నోటీసు కూడా ఇవ్వకుండా గురువారం ఉదయం 9 గంటలకే విజయవాడ ఏసీపీ దామోదర్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు సాక్షి ఎడిటర్‌ నివాసంలోకి ప్రవేశించి సోదాల పేరుతో హల్‌చల్‌ చేశారు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. తన నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్‌ వారంట్‌ చూపించాలని అడిగితే పట్టించుకోకుండా అన్ని గదుల్లో తనిఖీలు కొనసాగించడం గమనార్హం. ఏ కేసులో సోదాలు చేస్తున్నారు.. ఏం కావాలని ఎడిటర్‌ ధనంజయ రెడ్డి ఎంతగా అడిగినా ఏసీపీ దామోదర్‌ కనీస సమాధానం కూడా ఇవ్వలేదు. సమాచారం తెలిసిన పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇంటి తలుపులు వేసి.. ధనంజయ రెడ్డిని ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు. ధనంజయ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు... మీరు ఎప్పుడు వచ్చారు.. అంటూ ప్రశ్నలు వేయడం గమనార్హం. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారని అడిగితే సమాధానం మాత్రం చెప్ప లేదు. తమను లోపలికి అనుమతించాలని పాత్రికేయులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి, దౌర్జన్యపూరిత తీరుకు నిరసనగా పాత్రికేయులు అక్కడే ఆందోళన చేపట్టారు.సెర్చ్‌ వారంట్‌ ఇవ్వకుండానే ఇచ్చినట్లుఉదయం 11 గంటల సమయంలో తాము సోదాలు చేసినట్టు ఓ కాగితంపై రాసి సంతకం చేయాలని ధనంజయ రెడ్డికి చెప్పారు. సిట్‌ దర్యాప్తు చేస్తున్న మద్యం కేసులో నిందితులు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు తాము సెర్చ్‌ వారంట్‌తో వచ్చి సోదాలు నిర్వహించినట్టు పేర్కొనడం గమనార్హం. దీనిపై ఎడిటర్‌ ధనంజయ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అసలు మద్యం కేసులో నిందితులు తన నివాసంలో ఎందుకు ఉంటారని ఆయన పోలీసులను నిలదీశారు. కొంత కాలం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న తాను బుధవారం రాత్రే విజయవాడ వచ్చానని తెలిపారు. కేవలం సాక్షి పత్రికను బెదిరించేందుకే ఎడిటర్‌ నివాసంలో సోదాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సెర్చ్‌ వారంట్‌ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. అనంతరమే సోదాలు నిర్వహించినట్టు ఎలా రాస్తారని.. తాను ఎందుకు సంతకం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన న్యాయవాదితో సంప్ర­దించిన తర్వాతే సంతకం చేస్తానన్నారు. దాంతో న్యాయవాది మనోహర్‌ రెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించారు. పోలీసుల తీరును న్యాయవాది మనోహర్‌ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైనా సరే నిబంధనల ప్రకారం చేయాలని, పోలీసులు ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని న్యాయస్థానాలు స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. వ్యక్తి స్వేచ్ఛే అత్యున్నతమైందన్న న్యాయస్థానాల తీర్పులను కూడా ఖాతరు చేయరా అని పోలీసులను నిలదీశారు. కాసేపు తర్జనభర్జనల అనంతరం పోలీసులు సెర్చ్‌ వారంట్‌ను అప్పటికప్పుడు పెన్‌తో రాసి ఇచ్చి.. తాము సోదాలు చేసినట్టు పంచనామా నివేదికను సమర్పించి వెళ్లిపోయారు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులు సోదాల పేరుతో సాక్షి ఎడిటర్‌ నివాసంలో హల్‌చల్‌ చేశారు. కేవలం సాక్షి గొంతు నొక్కేందుకే ఇలా బెదిరింపులకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది.

Board of Control for Cricket in India officials want to cancel IPL4
ఐపీఎల్‌ వాయిదా?

ధర్మశాల: ఉగ్రవేటకు తలపెట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్‌ మిలిటరీ కుటిలబుద్ధితో క్రూరమైన దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్‌ సరఫరా (పవర్‌ బ్లాక్‌ అవుట్‌)ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్‌ సేవల్ని నిలిపివేసింది. పాక్‌ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు భారత సాయుధ బలగాలు రాత్రంతా శ్రమిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం దేశం కోసం భారత త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే స్టేడియాల్లో ఐపీఎల్‌ వినోదం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. భారత పౌరులు, ప్రధాన నగరాలే లక్ష్యంగా పాక్‌ ఆర్మీ విచక్షణా రహితంగా జరిపే దాడుల్ని తిప్పికొడుతున్నప్పటికీ... పొరపాటున ఏ మిసైల్, డ్రోన్‌ దాడి అయిన స్టేడియంలో పడితే... వేలల్లో ప్రేక్షకులు, పదుల సంఖ్యలోని విదేశీ, భారత క్రికెటర్లకు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుబాటులో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు సమావేశమై ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం ఐపీఎల్‌ రద్దు లేదంటే వాయిదా ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నేటి మ్యాచ్‌ యథాతథం ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తాం. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. ఆటగాళ్ల భద్రత, రవాణా తదితర పరిస్థితుల్ని సమీక్షించాకే తుది నిర్ణయం తీసుకుంటాం. లక్నోలో శుక్రవారం లక్నో సూపర్‌ జెయింట్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశాలే ఉన్నాయి. –ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ఐపీఎల్‌లో నేడులక్నో X బెంగళూరువేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Sakshi Editor Dhananjaya Reddy Fires On Chandrababu Govt5
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?: ఆర్‌.ధనంజయరెడ్డి

సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్‌ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్‌ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్‌ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్‌ చేస్తాం.. ఇది ఓపెన్‌ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారుఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్‌ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్‌ ద్వారా ప్రాసిక్యూషన్‌ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు. జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్‌ స్పాట్‌ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్‌ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు ఎందుకొచ్చారు.. సెర్చ్‌ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్‌.. ఇన్‌ అండ్‌ అరౌండ్‌ సెర్చ్‌ చేస్తున్నాం.. జస్ట్‌ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్‌ నంబర్, నా ఫోన్‌ నంబర్లు తీసుకున్నారు. వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్‌ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్‌ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది.

Elon Musk Starlink gets LOI for satcom licence6
స్టార్‌లింక్‌ శాట్‌కామ్‌ వచ్చేస్తోంది..!

న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ (శాట్‌కామ్‌) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్‌ కుబేరుడు ఎలాన్‌ మస్క్ కు చెందిన స్టార్‌లింక్‌ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్‌) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌–ఎల్‌వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి. శాట్‌కామ్‌ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్స్‌ బై శాటిలైట్‌ (జీఎంపీసీఎస్‌), ఐఎస్‌పీ, వీశాట్‌ సేవలకు సంబంధించి స్టార్‌లింక్‌నకు ఎల్‌వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్‌ లైసెన్సుతో నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి స్టార్‌లింక్‌కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌–స్పేస్‌) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది. ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్‌కు లైసెన్స్‌.. ఇప్పటికే యూటెల్‌శాట్‌ వన్‌వెబ్, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్‌లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్‌ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్‌లో తమ సొంత పంపిణీ, కస్టమర్‌ సర్వీస్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది. సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్‌ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్‌ ఆర్బిట్‌’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది.

Sakshi Guest Column On Operation Kagar7
‘కగార్‌’పై జనాంతిక ఆలోచనలు

కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి. విషయాలు పూర్తి బహిరంగమైనవే. అందు గురించిన చర్చలు హోరాహోరీగా సాగినవే. కానీ పరిస్థితులు ఒక దశ నుంచి ఒకానొక దశకు మారినపుడు అంతా సున్నితం అవు తుంది. ‘ఆపరేషన్‌ కగార్‌’ సందర్భంగా ఆపరేషన్‌ విషయాలు కాదుగానీ నక్సలైట్ల గురించి, నక్సలిజం గురించిన చర్చ సున్నితంగా మారింది. పక్షం రోజులకు పైగా సాగుతున్న కర్రె గుట్టల ఉదంతం, ఎప్పటినుంచో జరుగుతున్న ఆ చర్చకు ఒక తక్షణ లక్షణాన్ని తీసుకు వచ్చింది. ఇది సున్నితం కావటానికి కారణం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన ‘ఆపరేషన్‌’ను ఒక భీషణ సమరంగా మార్చటం కాదు. అందుకు నేపథ్య పరిస్థితులు ఇదమిత్థంగా ఫలానా అప్పటి నుంచి మొదలయ్యాయని చెప్పలేముగానీ, సుమారు మూడు దశాబ్దాలుగా కావచ్చు. అవి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక మాత్రం తీవ్రం కావటం మొదలైంది.ప్రస్తుత ప్రభుత్వం తన నక్సలైట్‌ వ్యతిరేక చర్యలకు ‘ఆపరేషన్‌ కగార్‌’ అనే పేరు పెట్టింది. ‘కగార్‌’ అనే హిందీ మాటకు నిఘంటు అర్థం ‘అంచు’ లేదా ‘చివరి స్థితి’, ‘చివరి దశ’ అని. రాజకీయ అర్థం ‘అంతిమ దాడి’ అని! ఇది ఇతరుల నిర్వచనం కాదు. నక్సలైట్లను, నక్సలిజాన్ని 2026 మార్చ్‌ చివరి నాటికి అంతం చేసి తీరగలమని హోంమంత్రి అమిత్‌ షా పదేపదే ప్రకటిస్తున్నారు. అది సాధ్యమా కాదా అన్నది కాదు ఇక్కడ చేస్తున్న ఆలోచన. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని, సుమారు 57 సంవత్సరాలుగా సాగుతున్న నక్సలైట్‌ ఉద్యమాన్ని పలువురు సమీక్షిస్తుండవచ్చు. అందులో భాగంగా, పైన ప్రస్తావించిన ఇటీవలి మూడు దశాబ్దాల కాలాన్ని కూడా. అంటే నక్సలిజం బలహీనపడుతూ వస్తున్న మూడు దశాబ్దాలను!ఎముకలు మెడలో వేసుకోని కాంగ్రెస్‌సూటిగా చెప్పుకోవాలంటే, మొదటి సగకాలం బలంగా సాగిన ఉద్యమం, తర్వాత సగకాలం నుంచి బలహీనపడుతూ వస్తున్నది. ఆ బలహీనతలు నాలుగు విధాలు. ఒకటి – సైద్ధాంతికంగా. రెండు – నాయకత్వ పరంగా. మూడు – ఉద్యమ నిర్వహణలో. నాలుగు – జనాదరణ విషయమై! ప్రభుత్వ అణచివేతలు ఎప్పుడూ ఉన్నవే. అణచివేతకు ఆరంభం తెలంగాణ రైతాంగ పోరాట కాలంలోనే జరిగినపుడు నక్స లిజం తర్వాతి కాలంలో అంతకు భిన్నంగా ఉండగల ఆస్కారమే లేదు. పైగా 1948కి 1968కి మధ్యకాలం 20 సంవత్సరాలు మాత్రమే. అప్పటినుంచి మరో 20 ఏండ్లు గడిచేసరికి నక్సలైట్‌ ఉద్యమ క్షీణతకు అంకురార్పణ జరిగింది. గమనించదగినదేమంటే, ఆ కాలమంతా పాలించింది బీజేపీ కాదు... కాంగ్రెస్‌. కొన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని, ప్రణాళికలు రూపొందించుకుని, ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించుకున్నప్పటి నుంచి అన్నీ కపటమైన రీతిలో అరకొరగానే అమలయ్యాయి. అందుకే 1947 నుంచి 20 ఏండ్లయే సరికి నక్సలైట్లు అవతారమెత్తారు. అన్ని మలుపులూ 20–20–20 గానే కనిపిస్తు న్నాయి. అదొక విచిత్రం. ‘ఆపరేషన్‌ కగార్‌’ తరహా మాటలను కాంగ్రెస్‌ ఉపయోగించ లేదు, బీజేపీ ఉపయోగిస్తున్నది. చేతలు అవే, మాటలు వేరు. మాటలు వేరవటానికి మంచి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్‌కు 1885 నుంచి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అందులో సామాజిక సమ్మిళితత్వం, ఉదారవాద మధ్యే మార్గం, కొంత అభ్యుదయ ధోరణి, దేశ వ్యాప్తమైన జాతీయత వంటివి ఉన్నాయి. అవి కాలం గడిచినకొద్దీ బలహీనపడుతూ అనేక అవలక్షణాలు ప్రవేశించినా, కనీసం ఎము కలను మెడలో వేసుకునే ధోరణి ఇంకా రాలేదు. ఆ కారణంగా, నక్సలిజం వెనుక పేదరికం ఉన్నమాట నిజమనీ, అది కేవలం శాంతి భద్రతల సమస్య కాదనీ, పేదల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయ గలమనీ మాటలు, ప్రకటనల రూపంలో చెప్పటం ఎన్నడూ మాన లేదు. అణచివేతలకు సాయుధబలాల ఉపయోగమైతే యథావిధిగా సాగించారు గాని, ‘కగార్‌’ తరహా ‘అంతిమ దాడి’ అనకుండా జాగ్రత్తపడ్డారు. పౌరహక్కుల సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసినా, వారికి ‘అర్బన్‌ నక్సల్స్‌’ అనే ముద్ర వేయలేదు.నాగరిక, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలలో ఉదారవాద, ప్రగతిశీల భావనల సంప్రదాయం గురించి తెలిసిందే. ముఖ్యంగా రినైజాన్స్, ఫ్రెంచ్‌ విప్లవం, పారిశ్రామిక విప్లవం, బ్రిటన్‌లో రాజ్యాంగ ఆవిర్భావ కాలాల నుంచి ఉన్నత తరగతులపై, మధ్యతరగతిపై ఈ ప్రభావాలు మొదలయ్యాయి. ఈ వర్గాలు ప్రగతిశీలమైనవేగానీ, వ్యవస్థలో సంస్కరణలను కోరటం మినహా వ్యవస్థలను కూలదోయా లనేవి కావు. ఆ పరిమితులను తెలిసినందువల్లనే ఇక్కడ పౌర హక్కుల సంస్థల పాత్రను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కనీసం ఒక మేర గౌరవించటం, ఒకోసారి వారిని సంప్రదించటం చేస్తుండేవి. ఆ ధోరణి గత పదేళ్లుగా ఎట్లా మారిందో కనిపిస్తున్నదే. ఇది అంతి మంగా వ్యవస్థకు మేలు చేసేది కాదని ప్రభుత్వం గ్రహించవలసిందే తప్ప ఎవరూ చెప్పగల స్థితి కనిపించటం లేదు.మారిన సమాజ ధోరణులుఉద్యమాలకు ఎగుడు దిగుడులు సహజమేగానీ, నక్సలైట్‌ ఉద్యమం పైన చెప్పిన నాలుగు బలహీనతలలో దేని నుంచి కూడా నిజమైన అర్థంలో బయటకు రాలేక పోయింది. లేనట్లయితే, వారు కర్రె గుట్టల సందర్భంలో ఈ విధంగా చిక్కుకు పోవటం, చర్చల కోసం పది రోజుల్లో నాలుగుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరటం, పౌర హక్కుల సంస్థలను కదలించేందుకు ఇంతగా ప్రయత్నించటం వంటి పరిస్థితులు ఏర్పడేవి కావు. ఇంత జరుగుతున్నా సమాజం నుంచి ఒకప్పటివలె స్పందనలు లేవు. ప్రస్తుత తరాలు వివిధ కారణాల వల్ల మారిపోయాయి. వారి దృష్టి ఇప్పుడు తమ కెరీర్‌పై, ఇతర అంశాలపై ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒకప్పుడు ఉద్యమానికి పెద్ద బలం. ఇపుడు కొద్ది ప్రాంతాలలోని కొంతమంది ఆదివాసీలు మాత్రం స్థానిక పరి స్థితులనుబట్టి నక్సలైట్లతో కదులుతున్నారు. స్వయంగా ఆదివాసీలైన ప్రజాప్రతినిధులు గతంలో కన్నా ఎక్కువగా స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల వెంట ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వెనుకటి తరాలకు ఉద్యమం పట్ల గురి తప్పి నిరాశ ఏర్పడగా, కొత్త తరాలకు ఒక అగాథం వచ్చి కొత్త ప్రపంచంలో తమ జీవితాలను వెతుక్కుంటున్నారు. ఒకపుడు మధ్యతరగతిలో గణనీయమైన భాగానికి ఆదర్శవాదాలు ఉండేవి. అది సోవియెట్‌ యూనియన్‌కు, ఇక్కడ కమ్యూనిస్ట్‌ పార్టీలకు, విప్లవకారులకు, సాహిత్య–కళాకార్యకలాపా లకు పచ్చని కాలం. ఆ తరహా మధ్యతరగతి ఇపుడు పిడికెడుగా మిగిలింది. వామ పక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.నక్సలైట్లకు కొత్త రిక్రూట్‌మెంట్లు తగ్గటం ఎప్పటినుంచో ఉన్నది. ఎన్‌కౌంటర్లలో ఒకపుడు ఒకరు చనిపోయినా వార్తలు, ప్రజలలో చర్చలు ఉండేవి. ఇపుడు చాలామంది చనిపోవటం వరుసగా జరిగితే తప్ప వార్తలు, చర్చలు కనిపించటం లేదు. మరొకవైపు సిద్ధాంతాలు, పోరాట పద్ధతులు, సంస్థ నిర్మాణాలు, నాయకత్వాలు ప్రస్తుత ఆధునికమైన, బలమైన ప్రభుత్వ వ్యవస్థలను ఎదుర్కొనగల విధంగా ఉన్నాయనే అభిప్రాయం వారి సానుభూతిపరులలోనైనా ఉందా అన్నది అనుమానమే. పౌరహక్కుల సంఘాల స్పందనలు సైతం స్వీయ సంశయాల మధ్య మందకొడిగానే కనిపిస్తున్నాయి. నక్సలైట్లు, నక్స లిజం భవిష్యత్తు అగమ్యగోచరం కావటానికి వెనుక ఈ పరిస్థితులు, దీర్ఘకాలిక పరిణామాలు అన్నీ ఉన్నాయి.విషయాన్ని జనాంతికంగా చర్చించుకోవటం ఎందుకంటే, ఒక వైపు పేదరికం, పీడన కొనసాగుదల, ధనిక–పేద తారతమ్యాల పెరుగుదల అనే వాస్తవ స్థితి ఎంత కనిపిస్తున్నదో, ఆ పరిస్థితులను మార్చే సంస్కరణల కోసం లేదా కొత్త వ్యవస్థ ఆవిష్కరణ కోసమని చెప్పేవారు విఫలం కావటం కూడా అంత కనిపిస్తున్నది. ఈ విష యాలు ముఖ్యంగా ‘కగార్‌’ వంటి సందర్భంలో దాపరికం లేకుండా మాట్లాడటం సున్నితమైనదే!టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Sakshi Editorial On India Britain Trade Freedom8
ఎట్టకేలకు స్వేచ్ఛా వాణిజ్యం

భారత్‌–బ్రిటన్‌ల మధ్య ప్రస్తుత వాణిజ్యాన్ని అనేక రెట్లు పెంచగలదని భావిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాలూ గురువారం ఒక అంగీకారానికి రావటం ద్వైపాక్షిక వాణిజ్యంలో కీలక మలుపు. త్వరలో న్యూఢిల్లీలో రెండు దేశాల ప్రధానులూ సమావేశమై లాంఛనంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటారు. వివిధ అంశాలపై ఇద్దరి దృక్పథాలూ వేర్వేరు కావటం, ఇద్దరూ పట్టువిడుపులు ప్రదర్శించకపోవటం తదితర కారణాల వల్ల ఒప్పందంపై మూడేళ్లుగా ఎడతెగని చర్చలు సాగాయి. వాస్తవానికి ఇరు దేశాల వాణిజ్యమూ 2004 నుంచి ఊపందుకుంది. ముఖ్యంగా ఔషధాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలూ, సర్వీసు రంగాల్లో మన దేశం నుంచి బ్రిటన్‌కెళ్లే ఎగు మతుల పరిమాణం బాగా పెరిగింది. అదే సమయంలో బ్రిటన్‌నుంచి మన దిగుమతులు కూడా చెప్పుకోదగ్గ స్థాయికి విస్తరించాయి. నిరుటి గణాంకాల ప్రకారం బ్రిటన్‌ మన నుంచి 3,300 కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటుండగా, బ్రిటన్‌కు మన ఎగుమతులు 2,300 కోట్ల డాలర్ల వరకూ వున్నాయి. ఈ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవటానికీ, సరుకుల నాణ్యతను పెంచటా నికీ ఈ ఒప్పందం మార్గ నిర్దేశం చేయబోతోంది. ఒప్పందం అమల్లోకి రాగానే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 12,000 కోట్ల డాలర్లకు చేరుతుందని ఇరు దేశాలూ అంచనా వేస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బయటికొచ్చినప్పటి నుంచీ కష్టాలు పడు తున్న బ్రిటన్‌ను గోరుచుట్టుపై రోకటి పోటులా కరోనా మహమ్మారి కాటేసింది. దాంతో అంతంత మాత్రంగా వున్న ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఈయూ సభ్యదేశంగా ఆ ప్రాంత దేశాలకు ఎలాంటి అవరోధాలూ లేకుండా సాగిపోయిన ఎగుమతులు ఇప్పుడు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈయూ నుంచి వెలుపలకు రావటంవల్ల 2022 మధ్యకల్లా ఉత్పాదకత 5.5 శాతం మేర తగ్గింది. ఇక అప్పటి నుంచీ వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి గల అవకాశాల అన్వేషణ ఎక్కువైంది. ముఖ్యంగా చురుకైన ఆర్థిక వ్యవస్థలతో ఒప్పందాలు కుదిరితే పరిస్థితి మెరుగవుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌ ఇప్పటికే ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 2028 నాటికి మూడో స్థానానికి ఎగబాకవచ్చన్న అంచనాలున్నాయి.అయితే కుదరబోయే ఈ ఒప్పందంపై రెండు దేశాల్లోనూ సహజంగానే విమర్శలున్నాయి. బ్రిటన్‌ కార్మికవర్గ ప్రయోజనాలను ప్రభుత్వం భారత్‌కు తాకట్టు పెట్టిందని అక్కడి విపక్షాల ఆరో పణ. ముఖ్యంగా స్వల్పకాలిక వీసాలపై బ్రిటన్‌ వచ్చే భారతీయ కార్మికులకూ, వారి యాజమాన్యా లకూ జాతీయ బీమా సంస్థ ఎన్‌ఐసీకి చేసే చెల్లింపుల నుంచి మూడేళ్లపాటు మినహాయింపు ఇవ్వ టాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ రాయితీ వల్ల బ్రిటన్‌ ఖజానా ఏటా పది లక్షల పౌండ్ల ఆదాయం నష్ట పోతుందనీ, ఈ వెసులుబాటు వినియోగించుకోవటానికి కంపెనీలు భారతీయ కార్మికులకు అధికంగా అవకాశాలిస్తాయనీ, దాంతో ఇక్కడివారి ఉపాధి దెబ్బతింటుందనీ వారి వాదన. ఇది కేవలం తాత్కాలిక ఉద్యోగాలకే వర్తిస్తుందని, బయటివారికి శాశ్వత ఉద్యోగాలిచ్చే అవకాశం ఉండబోదని ప్రభుత్వ జవాబు. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్‌లతో సహా 50 దేశాలకు ఇదే తరహా వెసులు బాట్లు ఇస్తుండగా భారత్‌తో కుదిరే ఒప్పందం వల్లే ఏదో జరిగిపోతుందని ఎలా అంటారని ప్రశ్నిస్తోంది. నిజానికి భారత్‌కు ఎన్‌ఐసీ వెసులుబాటు ఇవ్వకూడదని బ్రిటన్‌ భావించటం వల్లే ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడింది. మన దేశంలో సైతం ఈ మాదిరి ఒప్పందాలపై వ్యతిరేకత వుంది. ఎఫ్‌టీఏల వల్ల మన ఎగుమతులకన్నా అటునుంచి దిగుమతులు పెరుగుతాయనీ, అవి స్థానిక ఉత్పత్తులను దెబ్బతీస్తాయనీ విమర్శకుల వాదన. పర్యవసానంగా ఏర్పడే వాణిజ్యలోటు దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వారి విమర్శ. అలాగే ఈ ఎఫ్‌టీఏల వల్ల ఔషధ పేటెంట్లు, డేటా వినియోగం వంటి అంశాల్లో దేశీయ పరిశ్రమలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణ మొదటి నుంచీ వుంది. ముఖ్యంగా జెనెరిక్‌ ఔషధ పరిశ్రమ దెబ్బతిని సాధారణ జనం నష్టపోతారన్న విమర్శ. అక్కడి ఉత్పత్తులతో పోటీపడటం మనవాళ్లకు కష్టమవుతుందన్న వాదన సరేసరి.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల నష్టాలున్నట్టే లాభాలూ వుంటాయి. ఉదాహరణకు మన ఔళి ఉత్పత్తులు, దుస్తులపై బ్రిటన్‌లో ఇంతవరకూ 12 శాతం సుంకాలుండేవి. ఒప్పందం అమల్లోకొస్తే ఆ బెడద వుండదు. బ్రిటన్‌ మార్కెట్లలో మనతో పోటీపడే చైనాకు ఇది సమస్యాత్మకం. మన దుస్తులపై సుంకాలు పెంచుతామని అమెరికా బెదిరిస్తున్న వర్తమానంలో ఇది మనకు కలిసొచ్చే అంశం. బ్రిటన్‌కు దుస్తులు, తెరలు, దుప్పట్లు వగైరాల ఎగుమతులు కనీసం 4 శాతం వరకూ పెరు గుతాయని అంచనా. అదే సమయంలో బ్రిటన్‌ కార్లు, విస్కీ, వైద్య ఉపకరణాలు వగైరాలు చవగ్గా లభిస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు రూ. 5,000 పలికే విస్కీ ధర రూ. 3,500కు పడిపోతుంది. రాగల పదేళ్లలో మరింత తగ్గుతుంది. ఇది ఇక్కడి మద్యం పరిశ్రమకు చేటు కలిగించేదే. కార్ల పరిశ్రమలకూ జరిగేది ఇదే. ప్రస్తుతం బ్రిటన్‌ తయారీ కార్లపై వంద శాతం సుంకాలు విధిస్తున్నారు. అవి కాస్తా పది శాతానికి పడిపోతాయి. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గిరాకీ పెరుగుతుందని వాణిజ్య నిపుణుల భావన. లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాలు ఎగుమతులు విస్తరిస్తే మరింతగా ఎదుగుతాయని వారంటున్నారు. ఐటీ రంగానికి కూడా ఇది వర్తిస్తుంది. ఏటా బ్రిటన్‌ ఐటీ సంస్థల్లో కనీసం 60,000 మంది నిపుణులకు అవకాశాలు లభిస్తా యని చెబుతున్నారు. అయితే లాభనష్టాలేమిటో ఒప్పందంపై సంతకాలయ్యాకే తెలుస్తుంది.

Miss World competition to begin in Hyderabad from tomorrow9
సుందరీమణులు సిద్ధం..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రపంచ సుందరి (మిస్‌ వరల్డ్‌) పోటీలకు సమయం ఆసన్నమైంది. శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. మిస్‌ వరల్డ్‌ సంస్థతో కలిసి ప్రభుత్వం.. ఈ పోటీలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంపై ప్రత్యేక స్థానం పొందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. విదేశీ ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాల సుందరీమణులతో పాటు అంతర్జాతీయ మీడియా సైతం రానుండటంతో రాష్ట్ర రాజధాని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ధింది. పటిష్ట భద్రత సహా అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయినట్లు అధికరావర్గాలు వెల్లడించాయి. పలు దఫాలుగా సీఎం సమీక్షలురాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు, పెట్టుబడుల ఆకర్షణకు అందాల పోటీలను వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే పలు దఫాలుగా సమీ క్షలు నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు, కార్యక్రమా లు జరిగే ప్రదేశాలను కూడా సందర్శించారు. కంటెస్ట్‌లతోనూ ఒకసారి భేటీ అయ్యారు. పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రకృతి, పర్యా వరణ పరంగా అన్ని హంగులు ఉన్నా, తెలంగాణ ఆ రంగంలో వెనుకబడిందని భావిస్తున్న ప్రభుత్వం.. ఇకపై ‘తెలంగాణ జరూర్‌ ఆనా’(తప్పకుండా తెలంగాణ రండి) అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయా లని నిర్ణయించింది. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తోంది. సర్వాంగ సుందరంగా నగరంఈ పోటీల్లో పాల్గొనడానికి దాదాపు 100 మందికి పైగా సుందరీమణులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. నిర్వహణ సంస్థ మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌కు చెందిన 28 మంది ప్రతినిధులు, మరో 17 మంది సహాయకులు కూడా వచ్చేశారు. రానున్న రెండురోజుల్లో మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి వస్తారని నిర్వాహకులు తెలిపారు. అధికారులు నగరానికి చేరుకున్నారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా.. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విమానాశ్రయాల్లో కూడా ప్రపంచ సుందరి పోటీలకు వచ్చే వారికి ఆహ్వానం పలుకుతూ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయించింది. గత వారం రోజులుగా వస్తున్న అతిథులు అందరికీ తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతున్న పర్యాటక శాఖ, వారి బసకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రైడెంట్‌ హోటల్‌ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.అలరించిన రిహార్సల్స్‌ప్రపంచ సుందరి పోటీల కోసం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో గురువారం రిహార్సల్స్‌ ఉత్సాహంగా కొనసాగాయి. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న వివిధ దేశాల పోటీదారులు ఆకర్షణీయమైన వ్రస్తాలు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు. తమ ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్రాక్టీస్‌ చేశారు. ఇక సమయాను కూలంగా స్టేజ్‌ ఎంట్రీలు, గ్రూప్‌ మూవ్‌మెంట్స్, లైటింగ్, మ్యూజిక్‌ సెట్‌ అప్‌ తదితర అంశాలను నిర్వాహకులు పరిశీలించారు. ప్రధాన కార్యక్రమానికి ముందస్తుగా ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తూ రిహార్సల్స్‌ పూర్తిచేశారు.సామాన్యులకూ వీక్షించే చాన్స్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెలా ఖరు వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పరిమిత సంఖ్యలో సామాన్యులకూ కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టూరిజం వెబ్‌సైట్‌ ( https://tourism.telangana.gov. in/events&single/miss& world& event)లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి పోటీలు జరిగే ఒక్కో కేంద్రంలో వెయ్యి మంది చొప్పున మొత్తం 5 కేంద్రాల్లో 5వేల మందికి మిస్‌ వరల్డ్‌ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.

Ysrcp Meeting: Ys Jagan Fires On Chandrababu10
‘మీ బాధలు చూశా.. ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రాసుకోండి’

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర, మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన... ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్నవారిని అభినందించారు.‘‘రాష్ట్రంలో కూటమి సర్కార్‌.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్‌. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్‌సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్‌ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ.. మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్‌. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు సిగ్గు పడాలిఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్‌ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్‌ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాంఅవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాంనాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్‌ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైఎస్సార్‌సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే..ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్‌. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు.ఈ రోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్‌ మీడియ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్‌లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు.దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్‌ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.అవినీతి రాజ్యమేలుతోంది..విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడం కోసం యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈ రోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్‌ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్‌ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.బాండ్ల పేరుతో కొత్త అవినీతి:ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.మళ్లీ వచ్చేది మనమే:చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement