
సాధారణంగా చిలక పలుకులు అంటూ ఉంటాం కదా. రామచిలక మనిషి మాటలను అనుకరించడం మనకు తెలిసిందే. పెంపుడు పక్షి చిలుకు ముద్దార మాటలు నేర్పిస్తే చక్కగా పలుకుతుంది. తేనెలూరు ఆ మాటలు విని తెగ మురిసిపోతారు యజమానులు. ఇపుడు మాకేం తక్కువ అంటూ ఈ జాబితాలోకి వచ్చేసిందో కాకి. కాకి చేష్టలు, కారు కూతలు కావు... చక్కగా హాయ్.. హల్లో అంటూ పలకరిస్తూ.. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. సరైన శిక్షణ ఇస్తే.. ముద్దార నేర్పింపన్.. అన్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది. పదండి ఆ విశేషాలేంటో చూద్దాం.
అద్భుతమైన సామర్థ్యంతో ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తోందీ కాకి. కుటుంబ సభ్యులను పేరు పెట్టి పిలుస్తుంది. మరాఠీలో మాట్లాడేస్తుంది. ఈ కాకి కావు కావు కాదు... హాయ్ హాయ్ అని అరుస్తుంది! అయితే మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఒక కాకి మనిషి మాటలను అనుకరిస్తూ అందరినీ బోలెడు ఆశ్చర్యపరుస్తోంది.
వాడా తాలూకాలోని పాల్ఘర్‌కు చెందిన తనూజ ముక్నే అనే మహిళ తన తోటలో గాయపడిన కాకిని చూసి సపర్యలు చేసింది. కొన్ని రోజులు తరువాత కోలుకున్న కాకి తనూజ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయింది. అంతేకాదు... మనుషులు మాట్లాడే మాటలను అనుకరించడం మొదలు పెట్టింది. ‘పపా’ ‘బాబా’ మమ్మీ’ అంటూ వరుసలు పెట్టి పిలవడం మొదలుపెట్టింది. దీంతో ఈ కాకి లోకల్ సెలబ్రిటీగా మారింది!