సాక్షి, నెట్‌వర్క్ / అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి ఐదో విడత కార్యక్రమం తొలిరోజు నిరసనలు, నిలదీతలతో హోరెత్తింది. పాత సమస్యలపై పదేపదే వినతిపత్రాలు ఇవ్వాల్సి రావటంతో మంగళవారం పలుచోట్ల అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీశారు. అర్హులను పట్టించుకోకుండా అనర్హులకు ప్రయోజనాలు చేకూరుస్తున్నారని మండిపడ్డారు. దీంతో పోలీసు బందోబస్తుతో గ్రామసభలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
⇔ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గ్రామ సభలో బైరబోగు రావమ్మ అనే వృధ్దురాలు గత మూడేళ్లలో 29 సార్లు ఫించను కోసం దరఖాస్తు ఇచ్చినా మంజూరు కాకపోవడంపై కన్నీటి పర్యంతమైంది.
⇔ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పాతనౌపడలో తమకు ఇల్లు మంజూరు చేయకుండా రెండేసి ఇళ్లు ఉన్న వారికి ఇస్తున్నారంటూ పలువురు గ్రామస్థులు అధికారులను నిలదీశారు.
⇔ తూర్పు గోదావరి జిల్లాలో రుణమాఫీ విషయంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను రైతులు నిలదీశారు.
⇔ బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించాలని కొత్తపేట మండల పరిధిలోని కండ్రిగ గ్రామ సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
⇔ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం జన్మభూమి గ్రామసభను అడ్డుకున్న ఎత్తిపోతల పథకం రైతులు తమ భూములకు పరిహారం పెంచాలని ధర్నా చేశారు.
⇔ బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో గ్రామ సభలను ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
⇔ పెరవలిలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు చేదు అనుభవం ఎదురైంది. రేషన్‌కార్డులు ఉన్నా రేషన్ ఇవ్వకపోవడంపై మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
⇔ కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడు, ఆలూరు మండలం హత్తిబెలగల్, కల్లూరు మండలాల్లో గ్రామసభలను వివిధ సమస్యలపై స్థానికులు అడ్డుకున్నారు.
⇔ అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించటం లేదని రాయదుర్గం నియోజకవర్గం డి.హీరేహళ్ మండలం ఓబుళాపురం గ్రామంలో సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును సిద్దనగౌడ ప్రజలు నిలదీశారు.
⇔ విశాఖపట్నం జిల్లాలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిలకు జన్మభూమి సభలో గిరిజనుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గిరిజన ఎమ్మెల్యేగా ఎలా సమర్థిస్తావంటూ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని నిలదీశారు. చినలబుడులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై గిరిజనులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
⇔ భీమిలి రూరల్ మండలం కాపులుప్పాడలో జన్మభూమిలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసంగిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ‘ప్రతి జన్మభూమిలో దరఖాస్తు ఇస్తూనే ఉన్నా.. గత నాలుగు విడతల్లో ఇచ్చా.. మళ్లీ ఈ సభలో కూడా మీకే ఇస్తున్నా...’అని గ్రామానికి చెందిన కొండపు నరసింహ (70) మంత్రి గంటాను నిలదీశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వేపగుంట వద్ద ప్రజలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు ఎన్నైనా చెప్పండి...మీ సమస్యలు విననంటే వినను. ఇది సంక్షేమం.. సంతృప్తి సభ మాత్రమే. మీ సమస్యలు వినడానికి ఇది వేదిక కాదు’ అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
⇔ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలో విద్యార్థులతో తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టించి ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ రేషన్‌కార్డులు, డ్వాక్రా రుణమాఫీ అంశాలపై అధికారులను నిలదీయడంతో జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ అర్ధాంతరంగా సభ నుంచి నిష్క్రమించారు. జగ్గయ్యపేటలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేత ఉదయభాను నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
⇔ గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా సభా వేదికపై లేకుండానే టీడీపీ ఇన్‌చార్జి మద్దాలి గిరి, టీడీపీ నేతలు షౌకత్ వంటి వారు వేదికపై కూర్చొని జన్మభూమి సభలో హల్‌చల్ చేశారు. అయితే ఎమ్మెల్యే ముస్తఫా ప్రజల్లో కూర్చొని వారి పక్షాన సమస్యల గురించి అధికారులు, నేతలను ప్రశ్నించారు.
⇔ అమరావతిలో రాజధాని గ్రామాలకు సీడ్‌యాక్సిస్ రోడ్డు భూ సేకరణ నోటిఫికేషన్‌కు సంబంధించి జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు అధికారులను నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment