మణిగాంధీ ఎదుట డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న పూడూరు మహిళలు
కర్నూలు సీక్యాంప్: ‘వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన నీవు టీడీపీలోకి వెళ్లడానికి రూ.8 కోట్లు తీసుకున్నావట కదా?! ఆ డబ్బులో కొంత ఖర్చు చేసి మా ఊరికి రోడ్డు వేయించు..అంతవరకూ మా ఊళ్లోకి రావొద్దు’ అంటూ కర్నూలు మండలం పూడూరు గ్రామస్తులు కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని అడ్డుకున్నారు. గ్రామరోడ్డు అధ్వానంగా ఉందని, ఈ విషయాన్ని కొన్నేళ్లుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పూడూరు వాసులు బుధవారం జన్మభూమిని బహిష్కరించిన విషయం విదితమే.దీంతో ఎమ్మెల్యే మణిగాంధీ గురువారం పోలీసులు, టీడీపీ నాయకులు, ప్రైవేటు సైన్యంతో కలిసి దాదాపు 15 వాహనాల్లో వచ్చి గ్రామంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే..గ్రామస్తులు ఉదయం నుంచే ఊరి బయటకు చేరుకుని వంటావార్పు చేపట్టారు.
టైర్లను కాల్చి నిరసన తెలిపారు. జన్మభూమి వద్దు.. రోడ్డు కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంక్షేమ పథకాలు ఆపేస్తామని ఎమ్మెల్యే బెదిరించినా వెనక్కి తగ్గలేదు. గ్రామంలోకి 108 వాహనం కూడా వచ్చే పరిస్థితి లేదని, రోడ్డు సరిగా లేక, సకాలంలో వైద్యమందక దాదాపు 15 మంది చనిపోయారని, ఇందుకు మీదే బాధ్యత అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేతో గ్రామస్తులంతా వా గ్వాదానికి దిగిన సమయంలోనే రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలికి ఫిట్స్ వచ్చాయి. అమె ఫిట్స్‌తో అల్లాడిపోతుంటే ఎమ్మెల్యే మణిగాంధీ పట్టించుకోలేదు. వెంటనే గ్రామస్తులంతా 108కు ఫోన్ చేయగా ఎప్పటిలాగానే ‘పది కిలోమీటర్లు రండి.. అక్కడ మా అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంద’ని సమాధానం వచ్చింది.
మీ గ్రామం నా పరిధిలోకి వస్తుందా?
దాదాపు నాలుగేళ్లుగా గ్రామంవైపు చూడని మణిగాంధీ గురువారం పూడూరుకు రాగా.. రోడ్డు వేయండని స్థానికులు వినతిపత్రం ఇచ్చారు. దీంతో ఆయన ‘మీ గ్రామం.. నా పరిధిలోకి వస్తుందా’ అంటూ వెటకారంగా మాట్లాడారు. గ్రామస్తులు కూడా అదే తరహాలో స్పందిస్తూ.. ‘నువ్వు ఎవరు’ అంటూ ప్రశ్నించారు. కాగా.. ఎమ్మెల్యేతో ప్రజలు మాట్లాడుతుంటే ఈ మధ్యనే టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి కలుగజేసుకున్నారు. రాష్ట్ర పరిస్థితి బాగోలేదని, మీకు న్యాయం చేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి గ్రామస్తులు స్పందిస్తూ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోడ్డుగురించి మాట్లాడారని, ఇప్పుడు ఏ హోదాలో హామీ ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ఏ హామీ అయినా ప్రకాశ్‌రెడ్డే ఇస్తున్నారని, అసలు ఎమ్మెల్యే ఎవరో అర్థం కావడంలేదని అన్నారు. గ్రామస్తులు పట్టువీడకపోవడంతో చేసేదిలేక మణిగాంధీ వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment