ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో అధికారులతో వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు
కర్నూలు (అగ్రికల్చర్): జన్మభూమి గ్రామసభలు రసాభాసగా మా రుతున్నాయి. నిరసనలు.. నిలదీతలు.. ఆందోళనలు.. బహిష్కరణలు.. ఏ ఊరు చూసినా ఇదే పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాగా విసుగు చెందిన ప్రజలకు నిరసనలు తెలిపేందుకు జన్మభూమి సభలను వేదికగా మార్చుకుంటున్నారు. మంగళవారం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన సభలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఏదో తూతూమంత్రంగా నిర్వహించేసి తిరిగి వద్దామని వెళ్లిన అధికారులు జనాగ్రహానికి గురువుతున్నారు. గూడూరు, కర్నూలు, కోవెలకుంట్ల తదితర మండలాల్లో జరిగిన జన్మభూమి సభలు గందరగోళం మధ్య కొనసాగాయి. గూడూరు మండలం జూలకల్, కర్నూలు మండలం బి.తాండ్రపాడులో ఏకంగా ప్రజలు గ్రామసభను బహిష్కరించారు.
ప్రజలను రప్పించేందుకు పలు ఆర్థిక ప్రయోజనాలను ఏరగా వేసిన ఫలితం లేకుండా పోయింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, శాసనమండలి చైర్మన్ ఫరూక్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణలు ఓర్వకల్ మండలం హుసేనాపురం గ్రామంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామ సభల్లో రుణమాఫీ, రేషన్ కార్డులు, పింఛన్‌లు తదితర అంశాలపై ప్రజలు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. అధికారిక కార్యక్రమమైన జన్మభూమి సభలో తెలుగుదేశం నేతల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది ప్రభుత్వ భజనకే అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో జనాలు గ్రామ సభల వైపు రాలేని పరిస్థితి ఏర్పడింది.
⇔ గూడూరు మండలం జూలకల్‌లో గ్రామస్తులు జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గత ఏడాది ఇచ్చిన వినతులకు దిక్కు లేకపోవడం, అర్హులకు పింఛన్‌లు, రేషన్ కార్డులు లేకపోవడం, జన్మభూమి గ్రామ కమిటీ సభ్యులు చెప్పిన అనర్హులకే ఇస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తుతూ.. గ్రామసభను బహిష్కరించారు.
⇔ కోవెలకుంట్ల మండలం కలుగోట్లలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. అర్హులకు ఎవ్వరికి పింఛన్‌లు రాకపోడవం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం, అన్ని అర్హతలు ఉన్నా.. రుణమాఫీ రాకపోవడం తదితర వాటిపై అధికారులను నిలదీయడంతో పాటు గ్రామసభ జరుగకుండా అడ్డుకున్నారు.
⇔ కోడుమూరు మండలం అనుగొండ, ఎర్రదొడ్డి గ్రామాల్లో జరిగిన గ్రామసభలు అస్తవ్యస్తమయ్యాయి. ఇది వరకు జరిగిన నాలుగు సార్లు గ్రామసభల్లో రేషన్ కార్డులు, పింఛన్‌లు, పక్కా ఇళ్లకు దరఖాస్తులు ఇచ్చామని ఇందులో ఒక్కటీ పరిష్కరం కాలేదని ధ్వజమెత్తారు.
⇔ డోన్‌లో జరిగిన జన్మభూమి సభను సీపీఐ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకున్నారు. ప్రభుత్వ ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
⇔ ఆదోనిలోని 9వ వార్డులో జరిగిన సభలో ప్రజలు రేషన్ కార్డులపై అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. అర్హులెవ్వరికి రేషన్ కార్డులు రాలే దని ధ్వజమెత్తారు. ప్రజల నిరసనల మధ్య తూతూమంత్రంగా సభను ముగించేశారు.
⇔ బేతంచెర్ల, కొత్తపల్లి, ఆలూరు, అవుకు తదితర మండలాల్లో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులపై విరుచుకపడ్డారు. జన్మభూమి కమిటీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. రాజకీయ కారణాలతో అర్హులైన వారికి పించన్‌లు, రేషన్ కార్డులు, ఇళ్లు దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. ఆస్పరి మండలం ముత్తుకూరులో సభలో అధికారులను గట్టిగా నిలదీశారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే పింఛన్లు, కార్డులు ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బి. తాండ్రపాడులో ఉద్రిక్తత
కర్నూలు సీక్యాంప్: కర్నూలు మండలం బి.తాండ్రపాడులో మంగళవారం జన్మభూమి గ్రామ సభను గ్రామస్తులు బహిష్కరించారు. తహసీల్దార్ టీవీ రమేష్ బాబు, మండల అధికారులను రోడ్డుమీదే నిలబెట్టి ఆందోళనకు దిగారు. 2013లో ఇళ్లు లేని 1018 కుటుంబాలకు గ్రామంలోని సర్వే నెంబర్ 277లో పొజిషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ స్థలాన్ని ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీకి ఇచ్చేందుకు పంచాయతీలో సర్పంచ్, అధికారులు తీర్మానం చేశారు. ఈ విషయంపై మూడేళ్లగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామసభను అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు అధికారులను గ్రామంలోకి రానీవ్వమని తేల్చిచెప్పారు. మధ్యాహ్నం వరకు సభ జరుగలేదు. తాలుకా సీఐ వాసుకృష్ణ అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అధికారులు సభ నిర్వహించకుండానే వెనుది రుగారు. ఆందోళనలో గ్రామస్థులు పెద్దలక్ష్మన్న, శేఖర్, చిన్నలక్ష్మన్న, కబీర్, గౌండ వెంకటేశ్వర్లు, మోహన్‌బాబు పాల్గొన్నారు.
సేవలకు సత్కారాలు
జన్మభూమి కార్యక్రమంలో అత్యుత్తమ సేవలందించిన అధికారులను ఈనెల 11వ తేదీన సన్మానిస్తున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయంలో జన్మభూమి నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు రోజుకో అంశంపై చర్చించి ప్రజలను విశేషంగా చైతన్యపరుస్తున్న అధికారులను గుర్తించి సన్మానించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఓను ఆదేశించారు. సాధికార మిత్ర గ్రూపులను కూడా గుర్తించి సన్మానించాలన్నారు. ఈనెల 7వ తేదీన 5కే రన్‌లో పాల్గొని విజేతలుగా పది మందిని ఎంపిక చేయాలని డీఎస్‌డీఓను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment