
గజపతినగరంలో ఏపీఎంపై భౌతిక దాడి చేస్తున్న ప్రజాప్రతినిధులు
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో నిరసనలు తారాస్థాయికి చేరుతున్నాయి. వారంరోజుల్లో అనేక గ్రామసభలను బహిష్కరించి నిరసన తెలిపిన గ్రామీణ ప్రజలు ఎనిమిదో రోజైన మంగళవారం కూడా తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకోవడమే మినహా పరిష్కారం లేదంటూ అధికారపార్టీ నేతలను, అధికారులను అడ్డుకుని గ్రామసభలను బహిష్కరించారు. కొన్నిచోట్ల అధికారులను సమస్యలపై నిలదీసి పరిష్కారం చూపాలని కోరారు.
గజపతినగరంలో ఏపీఎంపై దాడి
గజపతినగరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో వెలుగు ఏపీఎం రౌతు శ్రీనివాసరావుపై తెలుగుదేశం నాయకులు చేయిచేసుకున్నారు. మహిళలతోనూ తిట్టించారు. గ్రామసభ జరుగుతున్న సమయంలో వెలుగులో జరుగుతున్న కార్యకలాపాలు తమకు చెప్పలేదంటూ గజపతినగరం–1 ఎంపీటీసీ కర్రి శ్రీదేవి, గజపతినగరం–2 ఎంపీటీసీ నగర ప్రసన్నకుమారి భర్త చందు, గ్రామ సర్పంచి నరవ ఆదిలక్ష్మి భర్త శంకర్రావు ప్రశ్నించారు. వెంటనే చెరొక వైపు పట్టుకుని దాడి చేశారు. ఈ అంశం ఇప్పుడు అధికార వర్గాలు, గజపతినగరం మండలంలో చర్చనీయాంశ«మైంది. మొన్నటికి మొన్న గజపతినగరం నియోజకవర్గానికి చెందిన నాయకులే జెడ్పీ సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులపై విరుచుకుపడ్డంతో ఇప్పుడు వెలుగు ఏపీఎంపై దాడి చర్చనీయాంశమైంది.
♦ కొమరాడ మండలంలో 30గ్రామాల గిరిజనులు జన్మభూమి కార్యక్రమానికి రావద్దంటూ పూడేసు పంచాయతీ పేడుము గ్రామం వద్ద కర్రకట్టి, రోడ్డుకు అడ్డంగా భైఠాయించి అడ్డుకున్నారు. రోడ్డు సౌకర్యం, మౌలిక వసతులు కల్పించాలని ఎన్నిసార్లు గ్రీవెన్స్‌సెల్‌లో మొరపెట్టుకున్నా స్పందించనందుకు నిరసనగా ఈ చర్యకు దిగారు. దీనివల్ల అధికారులు గ్రామం బయటే ఉండిపోయారు.
♦ గజపతినగరం మండలం పురిటిపెంటలో జరిగిన గ్రామసభలో నాలుగేళ్లుగా ప్రజల నుంచి వినతులు తీసుకోవడం తప్ప పరిష్కరించడం లేదని గ్రామ సర్పంచి మండల సురేష్ నిలదీశారు. ఇందుకు నిరసనగా గ్రామసభ బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
♦ శృంగవరపుకోటలో జరిగిన గ్రామసభలో సమస్యలపై నిలదీసిన వైఎస్సార్‌సీపీ నాయకులపై అధికారపార్టీ నాయకులు జులుం ప్రదర్శించారు. అధికారాన్ని వాడుకుని పోలీసులను పంపడంతో వారు వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేశారు.
♦ పూసపాటిరేగ మండలం నడిపల్లిలో సమస్యలు పరిష్కరించకుండా గ్రామసభ పెట్టినందుకు తెలుగుదేశంపార్టీకి చెందిన సర్పంచి బొజ్జ ఈశ్వరమ్మ,
గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించి నిరసన తెలిపారు.
♦ కురుపాం మండలం కిచ్చాడ గ్రామసభ రసాభాసగా మారింది. గ్రామంలో 20ఏళ్లుగా> రోడ్డు కోసం పట్టించుకునే నాథుడే లేడని, సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే గ్రామసభ పెట్టాలన్నారు. దీంతో అధికారులు వారితో చర్చలు జరిపి గ్రామసభను పూర్తి చేశారు.
♦ గరుగుబిల్లి మండలం లోకడివరం పరిధిలో ఉన్న స్టోన్ క్రషర్ అనుమతులు రద్దు చేయాలని సర్పంచి అప్పలనాయుడు ఆ«ధ్వర్యంలో ప్లకార్డులతో స్థానిక జన్మభూమి కార్యక్రమంలో నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే పతివాడకు పరాభవం
నెల్లిమర్ల మండలం తమ్మాపురం జన్మభూమి కార్యక్రమానికి హాజరైన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడును గ్రామస్తులు గ్రామం బయటే అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారని, ఇంతవరకు నెరవేరలేదని, రోడ్డు వేసిన తర్వాతే గ్రామానికి రావాలని తెగేసి చెప్పారు. గ్రామంలోకి ససేమిరా రానివ్వలేదు. ఈ సంఘటనతో తెలుగుదేశం నాయకులు సువ్వాడ రవిశేఖర్ తదతరులు రాయడానికి వీల్లేని పదాలతో బూతులు తిట్టడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.