ఇంటికి తాళం వేయడంతో ఆరుబయట పడిగాపులు కాస్తున్న వృద్ధ దంపతులు కిష్టప్ప, ఓబుళమ్మ
అవును.. ఆధునిక ప్రపంచంలో మనిషన్న వాడు మాయమైపోతున్నాడు. డబ్బు చుట్టూ అల్లుకున్న ఆశలకు రక్తసంబంధం కూడా చెదిరిపోతోంది. నవ మాసాలు మోసిన తల్లి.. కంటికి రెప్పలా చూసుకున్న తండ్రిని పచ్చనోటుతో తూకం వేసి చూస్తున్న తీరు కలికాలం కాక మరేమిటి. వెల కట్టలేని ప్రేమను.. వెంట తీసుకెళ్లలేని ఆస్తిపాస్తుల కోసం రాచి రంపాన పెట్టడం హృదయ విదారకం. రక్త మాంసాలు పంచిపెట్టిన తల్లిదండ్రులను ఆస్తుల పంపకంలో పొరపొచ్చాలకు వీధిన పెట్టడం సభ్య సమాజాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది.
హిందూపురం అర్బన్ : ముద్దిరెడ్డిపల్లిలో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు కిష్టప్ప(75), ఓబుళమ్మ(62) దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.పెద్ద కొడుకు లక్ష్మీనారాయణ స్థానిక పట్టుచీరల వ్యాపారం చేస్తుండగా.. రెండో కుమారుడు లోకేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కష్టాన్ని నమ్ముకున్న కిష్టప్ప పిల్లలకు ఏ లోటు రాకుండా రూ.3కోట్ల మేర ఇంటి స్థలాలు, ఇళ్లు సంపాదించాడు. దంపతులిద్దరూ పెద్ద కొడుకు వద్ద ఉండగా.. చిన్న కుమారుడు వీరి ఖర్చులకు డబ్బు పంపుతున్నాడు.
ఆ తర్వాత కొంత కాలానికి అన్న గొడవతో ఆరు నెలల క్రితం తల్లిదండ్రులను లోకేష్ బెంగళూరుకు తీసుకెళ్లాడు. తమను ఆదరించాడనే కారణంతో కిష్టప్ప ముద్దిరెడ్డి పల్లిలోని తన ఇంటిని చిన్న కుమారుని పేరిట రాసిచ్చాడు. ఈ విషయమై లక్ష్మీనారాయణ కోర్టును ఆశ్రయించాడు. వృద్ధులకు బెంగళూరు వాతావరణం సరిపడక స్థానికంగా ఉండేందుకు ఇష్టపడి తిరిగి నెల రోజుల క్రితం ముద్దిరెడ్డిపల్లి చేరుకున్నారు. అయితే తనకు అన్యాయం చేసిన తల్లిదండ్రులను ఇంట్లోకి అనుమతించేది లేదని పెద్ద కొడుకు బీష్మించాడు.కొడుకులు ఇద్దరికీ సొంత మనుమరాళ్లను కోడళ్లుగా తెచ్చుకున్నా ఈ వయస్సుల్లో ఎలాంటి కనికరం చూపించకపోవడం వారిని కలచివేస్తోంది.
ఇంటికి తాళం : పెద్ద కొడుకు ఆదరించకపోవడంతో చిన్న కుమారుడు లోకేష్ గ్రామంలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని తల్లిదండ్రులకు ఆవాసం కల్పించాడు. అయితే నెల రోజులు తరక్కుండానే రెండు రోజుల క్రితం యజమాని ఖాళీ చేయించడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో కష్టపడి సంపాదించుకున్న సొంతింట్లో ఉందామంటే పెద్ద కొడుకు తాళం వేయడంతో ఇప్పుడు ఆరుబయటే చలిలో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.
ఇరుగుపొరుగు సాయం
లక్ష్మీనారాయణకు స్థానికులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విధిలేని పరిస్థితుల్లో వృద్ధులు పోలీసులను ఆశ్రయించినా ఆస్తుల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పడంతో ఈ వృద్ధులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వీరి దయనీయ స్థితికి జాలిపడి ఇరుగుపొరుగు వారే ఆకలిదప్పికలను తీరుస్తున్నారు. అయితే ఎంతకాలం ఇలా? జీవిత చరమాంకంలో మాకెందుకీ ఖర్మ? కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి వెళ్లే అర్హత కూడా మాకు లేదా? న్యాయం చేసే వారే లేరా? అని ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
అజ్ఞాతంలో లక్ష్మీనారాయణ
విధిలేని పరిస్థితుల్లో తమ సొంతింటి వద్దకు చేరుకున్న వృద్ధ దంపతులకు నిరాశే మిగిలింది. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. రెండు రోజులుగా ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఇదే సమయంలో అతని భార్యా, పిల్లలు కూడా ఇంట్లోనే ఉండిపోయారు. లోపల వాళ్లు.. బయట వృద్ధుల ఆవేదన స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తోంది.
సొంతూళ్లోనే ఉంటామన్నారు
అమ్మానాన్న తమ జీవిత చరమాంకం సొంతూళ్లో గడపాలనుకుంటున్నారు. వారిని బెంగళూరులో నా వద్దే ఉంచుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే అక్కడి వాతావరణంలో ఇబ్బంది పడుతున్నారు. మా అన్న వాళ్ల బాగోగులు చూసుకుంటానంటే అందుకయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తా. – లోకేష్, చిన్న కుమారుడు
న్యాయం చేస్తాం
సీఎం పర్యటన బందోబస్తులో ఉన్నాం. వచ్చిన వెంటనే శుక్రవారం కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడుతాం. వృద్ధ దంపతులకు తప్పకుండా న్యాయం చేస్తాం. – చిన్న గోవిందు, సీఐ
Comments
Please login to add a commentAdd a comment