ఇక దూకుడే | ఉధృతం చేసేందుకు ప్రణాళికలు | Sakshi
Sakshi News home page

ఇక దూకుడే

Published Mon, Sep 23 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

ఉధృతం చేసేందుకు ప్రణాళికలు

సాక్షి, తిరుపతి/ కార్పొరేషన్: సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వారం తా ఏకమయ్యారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి వేదికగా తిరుపతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేయాలని తీర్మానించారు. ఆర్టీసీ జేఏసీ, ఫ్రెండ్స్ అసోసియేషన్ పిలుపుమేరకు ఉద్యోగ , ప్రజాసంఘాల నాయకులు, రాజకీయవేత్తలు ఆది వారం రాత్రి ఓ ప్రైవేటు హోటల్‌లో ఉద్యోగ-ప్రజాసంఘాలు-సమైక్యవాదుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.

జాతీయ మీడియా ద్వారా ఢిల్లీ పెద్దలకు సమైక్యవాణిని వినిపించాలంటే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతే వేదిక కావాలని తీర్మానించారు. అందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను కేంద్రం పట్టించుకోవడం లేదనే నిర్ణయానికి వచ్చారు. సమైక్యవాణి ఢిల్లీకి వినిపించాలంటే రైల్‌రోకోతోపాటు తిరుమలకు రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. కేసులుపెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. కేసు లు పెడితే ఉచితంగా న్యాయసహాయం అందించి నిర్దోషులుగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయవాదుల జేఏసీ హామీ ఇచ్చింది.

 ఒక్కటైన 150 జేఏసీలు

సమైక్యాంధ్ర కోసం 48 ప్రభుత్వ శాఖల జేఏసీలు, 22 ఉపాధ్యాయ, 8 ఆర్టీసీ, 72 ప్రజాసంఘాలు ఒక్కటయ్యాయి. సంఘాల ప్రతినిధులంతా సోమవారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా తిరుమలకు రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. 24న శ్రీవారి భక్తులెవరూ తిరుమలకు రావద్దని పిలుపునిచ్చారు. కనీసం ద్విచక్ర వాహనాలూ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. సోమవారం నుంచి 30వ తేదీ వరకు ప్రైవేటు పాఠశాలలు సంపూర్ణంగా బంద్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేసేం దుకు నిర్ణయించారు. వీరే ఉద్యమానికి సారథ్యం వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 24న టీటీడీలోని అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొనాలన్నారు. అదే రోజు రహదారులను దిగ్బంధించాలన్నారు. నాల్గవ తరగతి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు తిరుపతి టౌన్‌బ్యాంక్ ముందుకొచ్చినట్టు ఆ బ్యాంక్ అధ్యక్షుడు పులుగోరు మురళీకృష్ణారెడ్డి ప్రకటిం చారు.

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్, ఆర్డీవో రామచంద్రారెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకులు మునిసుబ్రమణ్యం, ప్రకాష్, ఆవుల ప్రభాకర్‌యాదవ్, సురేంద్రబాబు, లతారెడ్డి, ఈసీ బాబు, డాక్టర్ కృష్ణప్రశాంతి, నరసింహులునాయుడు, న్యాయవాద జేఏసీ నుంచి దినకర్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, నవీన్‌కుమార్‌రెడ్డి, విద్యా సంస్థల జేఏసీ నుంచి తమ్మినేని వెంకటేశ్వర్లు, శర్మ, టీటీడీ జేఏసీ నుంచి విజయకుమార్, మెడికల్ జేఏసీ నుంచి చెంగల్రాయులు, రుక్మిణి, ఏపీఎన్‌జీవోల నుంచి విజయలక్ష్మి, నిర్మల, సాం స్కృతిక జేఏసీ నుంచి సురేష్, బీసీ జేఏసీ నుంచి అశోక్‌సామ్రాట్, సాప్ప్ జేఏసీ నుంచి రాజారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement