మూడు రాజధానులకే ఓటు | People From All The Districts Are Supporting Three Capitals in the State | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులకే ఓటు

Published Thu, Jan 9 2020 4:41 AM | Last Updated on Thu, Jan 9 2020 4:41 AM

People From All The Districts Are Supporting Three Capitals in the State - Sakshi

మూడు రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలని అఖిలాంధ్ర ప్రజానీకం  నినదిస్తోంది. కొందరి రాజకీయ స్వార్థపు మాటలను పట్టించుకోనక్కర లేదని నినదించింది. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణతోనే సామాజిక, ఆర్థిక న్యాయం సాధ్యమవుతుందన్న శివరామకృష్ణన్, జీఎన్‌ రావు కమిటీలు, బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదికలను అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన సూచనలకు వాస్తవ రూపం ఇవ్వాలని విన్నవించింది. ఇటు అనంతపురం మొదలు అటు శ్రీకాకుళం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు మూడు రాజధానులకు సై అంటూ ఉద్యమించారు.. ప్రతిపక్షనేత చంద్రబాబు కేవలం తన, తన బినామీల ఆస్తుల పరిరక్షణ కోసమే రాజధాని ప్రాంత రైతులను, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాంత అభివృద్ధికే పట్టు పడుతున్న చంద్రబాబు తీరును ఎండగడతామని, బస్సు యాత్రను అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు.    

పుట్టపర్తి టౌన్‌: పాలకుల నిర్లక్ష్యంతో రాయలసీమకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోందని రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక పేర్కొంది. పరిపాలన వికేంద్రీకరణకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో లోచర్ల పెద్దారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి అ«ధ్యక్షతన బుధవారం రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. దీనికి ఆ వేదిక కన్వీనర్‌ బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అయితే శ్రీభాగ్‌ ఒడంబడిక మేరకు కర్నూలుసహా రాయలసీమ ప్రాంతానికి మరింత న్యాయం చేయాలన్నారు.
రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక సమావేశానికి హాజరైన నేతలు 

విశాఖలో మేధావుల ర్యాలీ
ద్వారకానగర్‌ (విశాఖ): విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ మేధావులు, మహిళలు, విద్యార్థులు బుధవారం సాయంత్రం విశాఖలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో.. ఉత్తరాంధ్ర చైతన్య వేదిక కన్వీనర్‌ బలగప్రకాష్‌ మాట్లాడుతూ.. అన్ని హంగులు ఉండి పరిమిత వ్యయంతో రాజధాని నిర్మాణానికి అనుకూలమైన ఏకైక నగరం విశాఖ అన్నారు. ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ.. విశాఖలో వెంటనే కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి సహకారం
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి  
గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి చెప్పారు. జీఎన్‌ రావు కమిటీ నివేదిక వెలువడిన వెంటనే ఎన్జీవో కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చించామని, మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించాలని ఎన్జీవో సంఘం నిర్ణయించిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్‌ను కోల్పోయి కట్టుబట్టలతో రాష్ట్రానికి వచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, పాలన వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు
నెల్లూరు (బారకాసు): ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరు వచ్చిన ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని, అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాల్లో విస్తరింపజేయడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. విశాఖ, కర్నూలు నగరాల్లో పాలన విస్తరించడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ రాజధాని విషయంలో బీజేపీకి ఒక స్పష్టమైన విధానం ఉందన్నారు.

ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారు
వుడా మాజీ చైర్మన్‌ డాక్టర్‌ రెహమాన్‌ ధ్వజం 
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విషం కక్కుతున్నారని వుడా మాజీ చైర్మన్, విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన డాక్టర్‌ ఎస్‌.ఎ.రెహమాన్‌ ధ్వజమెత్తారు. వాస్తవాలను కప్పిపుచ్చుకోవడానికి రైతులను పక్కదారి పట్టించి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందన్నారు. ఏమాత్రం ప్రజాదరణ లేని తన కుమారుడిని అధికారంలో కూర్చోబెట్టడానికి కుట్రలు పన్నుతున్నారని, దీని కోసం అమరావతిని పావుగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు స్వార్థానికి అమరావతి రైతులు బలవుతున్నారని విమర్శించారు. కేవలం గ్రాఫిక్స్‌తో ప్రజలకు జిమ్మిక్కులు చూపించిన చంద్రబాబు ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయడానికి సహాయపడతానని సీఎం వైఎస్‌ జగన్‌కి లేఖ రాయాలన్నారు. విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా మారితే త్వరలోనే ప్రపంచాన్ని తలదన్నే మహానగరంగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ మంచి విజన్‌ కలిగిన నేత అని, అన్ని పథకాలు బడుగు, బలహీన వర్గాలకు చేరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం
పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి
ఎల్‌.ఎన్‌.పేట: అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ బుధవారం శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట మండల కేంద్రంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

కడపలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం 
కడప కార్పొరేషన్‌: మూడు రాజధానులతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా కడపలో బుధవారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కోటిరెడ్డి సర్కిల్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు, శవరాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం
చంద్రబాబుకు ఎంపీ నందిగం హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయత్నిస్తే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ హెచ్చరించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులను రెచ్చగొట్టే చంద్రబాబు దుర్మార్గపు చర్యలు ఇక సాగవని చెప్పారు. ఆయన ఒక ప్రాంత, ఒక కులానికి నాయకుడిగా మిగిలిపోతున్నందుకు సిగ్గు పడాలన్నారు. అడుగడుగునా దుర్మార్గమైన వ్యక్తిగా, ఫ్యాక్షనిస్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ముసుగులో టీడీపీ గూండాలు చేరి ఎమ్మెల్యేలపై హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కారు దిగి ఉంటే వారిని అంతమొందించేందుకు కూడా టీడీపీ గూండాలు వెనకాడే వారు కాదన్నారు. 

దోచుకున్న సొమ్ము కోసమే పోరాటం
రాజధాని రైతులు భూముల కోసం, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అందరూ బాగుండాలని పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం దోచుకున్న సొమ్మును కాపాడుకోవటం కోసమే పోరాటం చేస్తున్నారని ఎంపీ విమర్శించారు. ధర్నా, బంద్‌ జరిగితే ఒక్క బస్సు, కారయినా తగలబడలేదా అని అడిగే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రాజధాని రైతులకు సీఎం వైఎస్‌ జగన్‌ అన్నివిధాలుగా అండగా ఉంటారని చెప్పారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు మూడు ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వైజాగ్‌ను అభివృద్ధి చేసి, కర్నూలులో హైకోర్టు పెడితే చంద్రబాబుకు వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. ఒక వ్యక్తి బాధపడితేనే చూస్తూ ఊరుకునే మనస్తత్వం సీఎం వైఎస్‌ జగన్‌ది కాదని, అలాంటిది 29 గ్రామాల్లోని రైతులు ఏ చిన్న ఇబ్బంది పడినా చూస్తూ ఎలా ఊరుకుంటారని, వారికి తగిన న్యాయం చేస్తారని చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీలు 
రాజమహేంద్రవరం: మూడు రాజధానులే ముద్దు... ఎవరి మాటా వినొద్దంటూ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పరిపాలన వికేంద్రీకరణను స్వాగతిస్తూ ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయా కూడళ్లలో మానవహారాలు చేపట్టారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరం మండలం కోటిపల్లిలో ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యండగండి, పామర్రు, తామరపల్లి, సత్యవాడ తదితర గ్రామాల్లో ఈ ర్యాలీ సాగింది. పాశర్లపూడి కొండాలమ్మచింత సెంటర్‌లో 216వ నంబర్‌ జాతీయ రహదారిపై స్థానికులు, ప్రభుత్వ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 

మూడు రాజధానులను అందరూ స్వాగతించాలి 
రాజాం: మూడు రాజధానులను అందరూ స్వాగతించాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు కోరారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను విశాఖకుకేటాయించడం సరైన నిర్ణయమన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని మాధవ బజార్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement