ఇక సమరమే..
బరిలో 13 మంది అభ్యర్థులు
చివరివరకు టీడీపీ బేరసారాలు
ఫలించని ఏకగ్రీవం యత్నాలు
సానుభూతిపైనే సుగుణమ్మ ఆశలు
వ్యతిరేకత కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా
తిరుపతి: ఉప ఎన్నికలో పోటీ అనివార్యమైంది. ఏకగ్రీవం కోసం తెలుగుదేశం పడరాని పాట్లు పడింది. అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరించేందుకు బేరసారాలకు దిగింది. అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో పోటీలో తలపడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పలువురు అభ్యర్థులు నామినేషన్ వేశాక ఆసక్తికర పరిమాణాలు చోటుచేసుకున్నాయి. ఏకగ్రీవం కోసం నేరుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితోనే కొంతమంది రహస్య మంతనాలు జరిపారు. దీనిని ముందే పసిగట్టిన మాజీ ఎంపీ చింతామోహన్ తన నివాసం నుంచి పార్టీ అభ్యర్థి ఎక్కడికి వెళ్లకుండా కట్టుదిట్ట ఏర్పాట్లు చేసుకోవడంతో దేశం ఆశలు గల్లంతయ్యాయి. ఓ దశలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు ముందే భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. మొదట దీనిని తేలికగా తీసుకున్నా పార్టీ అభ్యర్థి బరిలో దిగిన తరువాత తెలుగుదేశం పార్టీ అందోళనకు గురై బేరసారాలకు ప్రయత్నించింది. దీనికితోడు కొంత మంది తెలుగు దేశం నేతలు సైతం ఎన్నికల ఖర్చు భరిస్తామని పోటీ నుంచి ఉపసంహారించుకోవద్దని స్వతంత్ర అభ్యర్థులను ప్రలోభ పెట్టినట్లు తెలిసింది. దీన్ని బట్టే టీడీపీ అభ్యర్థిపై పార్టీలో ఎంత వ్యతిరేఖత వ్యక్తమయ్యేదీ అర్థమైపోతోంది.
సానుభూతిపైనే ఆశలు..
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సానుభూతిపైనే ఆశలు పెట్టుకొంది. పార్టీలో అసమ్మతి అభ్యర్థికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కడ పుట్టి ముంచుతాయోనని అధిష్టానం అందోళన చెందుతోంది. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తమవుతోందనే సంకేతాలు వెళతాయని దేశం పార్టీ ముఖ్య నేతలు సైతం హైరానా పడుతున్నట్లు పార్టీవర్గాలే పేర్కొంటున్నాయి. ఉపఎన్నిక గండం నుంచి గట్టేక్కెదెలా అని అధిష్టానం తల పట్టుకుంటున్నట్లు సమాచారం
కాంగ్రెస్‌లో అసమ్మతి..
కాంగ్రెస్ అభ్యర్థిని సైతం అసమ్మతి వెంటాడుతూనే ఉంది. మాజీ ఎంపీ చింతామోహన్ తప్ప ఆమెకు ఎవరూ సహకరించడం లేదు. దీంతో అభ్యర్థికి ఒంటరి పోరు తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. డ్వాక్రా రుణాల మాఫీ కాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ అంశం కలసి వస్తుందని అంచనా వేస్తోంది.