
సాక్షి, అమరావతి: రాష్ట్రాల ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలోది కాదని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు కమిషన్‌కు ఎటువంటి సంబంధంలేదని.. అది జాతీయ అభివృద్ధి మండలి పరిధిలోనిదని ఆయన తెలిపారు. హోదాను అమలుచేసే బాధ్యత ప్లానింగ్ కమిషన్ తీసుకుంటుందన్నారు. అలాగే, ఏపీ హోదాను 14వ ఆర్థిక సంఘం అడ్డుకుందని చెప్పడం అవాస్తవమన్నారు. సచివాలయంలోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు తాను అనుకోవడం లేదన్నారు.
ఇది రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు. రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి, విశ్లేషించడమే కమిషన్ పని అని సింగ్ తెలిపారు. తాము 29 రాష్ట్రాలలో పర్యటించి ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తామన్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాలలో పర్యటించామని, మిగిలిన రాష్ట్రాల పర్యటనలు కూడా ఈ ఏడాది చివరికి పూర్తి చేస్తామన్నారు. జనాభా లెక్కల విషయంలో రాష్ట్రపతి నోటిఫికేషన్‌కు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో తాను రాజ్యసభలో ఏపీకి మద్దతుగా మాట్లాడానని ఆయన గుర్తుచేస్తూ.. కమిషన్ పరిధికి లోబడి మాత్రమే తాము పనిచేయవలసి ఉంటుందన్నారు.
సానుకూలంగా 15వ ఆర్థిక సంఘం
రాష్ట్ర విభజన ఏ పరిస్థితుల్లో జరిగింది, ఎటువంటి సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటోంది, తదితర అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని 15వ ఆర్థిక సంఘం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని నందకిశోర్ సింగ్ చెప్పారు. రాజకీయ పార్టీలతో చర్చలు కూడా సానుకూల వాతావరణంలో జరిగినట్లు ఆయన తెలిపారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటిస్తోందని.. అందులో భాగంగానే తాము గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో, సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామన్నారు.
రాష్ట్రంలోని పరిస్థితులను, సమస్యల తీవ్రతను సీఎం వివరించారని ఆయన చెప్పారు. సీఎం డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని అవకాశం ఉన్నంత వరకు రాష్ట్రానికి న్యాయం చేస్తామని.. అందుకు కమిషన్ సిద్ధంగా ఉన్నట్లు సింగ్ తెలిపారు. కాగా, తమ పర్యటనలో భాగంగా బుధవారం కొన్ని పంచాయతీలను, ఆరోగ్య కేంద్రాలను సందర్శించినట్లు చైర్మన్ చెప్పారు. సమావేశంలో 15వ ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్ అశోక్ లహిరి, డాక్టర్ అనూప్ సింగ్, శక్తికాంత్ దాస్, ప్రొఫెసర్ రమేష్ చంద్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. రవిచంద్ర, కార్యదర్శి పీయూష్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.