2000 కోట్ల భారం | 2000 crore burden ap govt | Sakshi
Sakshi News home page

2000 కోట్ల భారం

Published Tue, Oct 31 2017 3:26 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

2000 crore burden ap govt - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్‌ (జలాశయం) పనులకు మరోసారి రెక్కలొస్తున్నాయి. కేంద్ర జలవనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, పాత కాంట్రాక్టర్‌తోనే పనులు చేయించాలని చెప్పినా ఖాతరు చేయకుండా కేబినెట్‌ సిఫార్సు పేరుతో హెడ్‌వర్క్స్‌ పనుల్లో కాంక్రీట్‌ పనులు (స్పిల్‌వే, స్పిల్‌ చానల్, స్టిల్లింగ్‌ బేసిన్‌) పనులను అస్మదీయ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాధరల ప్రకారం పనులు అప్పగిస్తే రాష్ట్ర ఖజానాపై రూ.2000 కోట్లు భారం పడనున్నప్పటికీ కేబినెట్‌ తీర్మానం ద్వారా ఆ పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్ణయిం చారు. భారీ మొత్తంలో కమీషన్లు పొందేందుకే 60సీ నిబంధనను తెరపైకి తెస్తున్నారని తెలుస్తోంది. పాత కాం ట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ యజమాని రాయపాటి సాంబశివరావు అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో అతను సరిగా పనులు చేయలేకపోయినా ఇన్నేళ్లూ తప్పించలేకపోయారు. మరోవైపు అతని నుంచి రావాల్సిన కమీషన్లు ఇప్పటికే వచ్చేసిన నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్‌ను అలాగే కొనసాగిస్తూ, కాంక్రీట్‌ పనులను పెంచిన ధరలతో కొత్త కాంట్రాక్టరుకు అప్పగించడం ద్వారా సరికొత్త కమీషన్లు పొందేందుకు వ్యూహం రచించారని తెలుస్తోంది. పోలవరం కాంక్రీట్‌ పనుల్లో కదలిక కనిపించకపోవడంతో ఆ పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్‌ నుంచి తప్పించి పెంచిన ధరల ప్రకారం కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను జలవనరుల శాఖ అధికారులు తోసిపుచ్చారు. దీంతో ఈ నెల 25న కేంద్ర జలనవరుల శాఖ మంత్రి గడ్కరీని కలిసి వివరించారు. అదనపు భారం పడే ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోమని కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రస్తుతం స్పిల్‌వేలో మిగిలిన 9.12 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్టిల్టింగ్‌ బేసిన్‌లో 3.49 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ చానల్‌లో 18 లక్షల క్యూబిక్‌ మీటర్లు వెరసి 30.61 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకు పెంచిన ధరల మేరకు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పనుల విలువ 2015–16 అంచనా ప్రకారం రూ.2928.51 కోట్లు. పెంచిన ధరల ప్రకారం ఈ పనుల విలువు సుమారు రూ.5000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంటే రాష్ర ఖజానాపై కనీసం రూ.రెండు వేల కోట్ల భారం పడుతుంది. కేంద్రానికి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించి ఉంటే ఈ భారం పడేది కాదని, కేవలం భారీ కమీషన్ల కోసమే రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం మోపుతున్నారని జలవనరుల శాఖ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.  
 
ఇప్పటికే అదనపు బిల్లులు
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ను ట్రాన్స్‌ట్రాయ్‌–జేఎస్సీ–ఈసీ–యూఇఎస్‌ (జేవీ) రూ.4,154 కోట్లకు 2013లో దక్కించుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం మార్చి 3, 2018 నాటికి పనులను పూర్తి చేయాలి. పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, లేని ప్యాకేజీ కింద ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. ఆ తర్వాత ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించింది. ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డుపెట్టుకుని మట్టిపనులను త్రివేణి, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్, డయాఫ్రమ్‌ వాల్‌ పనులను ఎల్‌ అండ్‌ టీ– బావర్, కాపర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ పనులను కెల్లర్, కాంక్రీట్‌ పనులను పెంటా, ఫూడ్‌జమీస్టర్, గేట్ల పనులను బీకెమ్‌ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టు కింద అప్పగించింది. ఈ వ్యవహారంలో ‘ముఖ్య’నేత కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఒప్పందం గడువు ముంచుకువస్తున్నా హెడ్‌వర్క్స్‌ పనుల్లో కదలిక లేకపోవడాన్ని నిలదీస్తూ గత జూలై 12న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌ సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు లేఖ రాయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కలకలం రేగింది. 10.55 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులకు గాను 7.59 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. మరో 2.96 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని మిగిలి ఉంది. 34.04 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకు గాను 3.43 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పనే జరిగింది.

ఇంకా 30.61 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని మిగిలి ఉంది. కాంక్రీట్‌ పనుల్లో కదలిక కనిపించకపోవడంతో ఆ పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్‌ నుంచి తప్పించి తాజా ధరల ప్రకారం కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తోసిపుచ్చారు. టెండర్‌ ఒప్పందం మార్చి 3, 2018 వరకు ఉందని, ఆలోగా అంచనా వ్యయం పెంచడం నిబంధనలకు విరుద్ధమని చెప్పినా ఇప్పటికే రూ.1481.41 కోట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని, అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే జీవో 22, జీవో 63 మేరకు అదనపు బిల్లులు చెల్లిస్తున్నామని, ఇప్పుడు మళ్ళీ అంచనా వ్యయం పెంచడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. దాంతో యధాప్రకారం ఈ ప్రతిపాదనపై కేబినెట్‌లో ఆమోదముద్ర వేసి కాంక్రీట్‌ పనులను తాను ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు అప్పగించి కమీషన్లు రాబట్టుకోవడానికి సీఎం చంద్రబాబు పావులు కదిపారు. ఇప్పటివరకు హెడ్‌వర్క్స్‌ పనులకు రూ.2,493 కోట్లను బిల్లులుగా చెల్లించగా.. ఇందులో మట్టిపనులకు చెల్లించిన బిల్లులే రూ.1,500 కోట్లు కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement