నేడే ఎంసెట్
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం జరుగనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంసెట్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో దరఖాస్తు చేసిన 25,250 మంది విద్యార్థుల కోసం 55 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇంజినీరింగ్ పరీక్షకు 20,300 మంది, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలకు 4,950 మంది హాజరు కానున్నారు. ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 43 కేంద్రాల్లో ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ 11 కేంద్రాల్లో మెడిసిన్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్థిష్ట సమయానికి అరగంట ముందుగా విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందజేస్తారు. ఉదయం 10.00, మధ్యాహ్నం 2.30 తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని , ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని అధికారులు చెప్పారు.
ప్రత్యేక బస్సులు
విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులతోపాటు వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 55 బస్సులను ఏర్పాటు చేశారు. యూనివర్సల్ ఇంజినీరింగ్ కళాశాల(డోకిపర్రు), కిట్స్ కళాశాల(వింజనంపాడు), వీవీఐటీ(నంబూరు), ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల, కళ్ళం ఇంజినీరింగ్ కళాశాల (చోడవరం), చలపతి ఇంజినీరింగ్ కళాశాల (లాం), మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాల (తుమ్మలపాలెం), చేబ్రోలు హనుమయ్య ఫార్మశీ కళాశాల (చోడవరం), చలపతి ఇంజినీరింగ్ కళాశాల (మోతడక)ల బస్సులు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ సెంటర్, లాడ్జి సెంటర్ ప్రాంతాల్లో ఉదయం 7.30, 8.00 గంటలకు బయల్దేరనున్నాయి.
నిరంతరం నిఘా
ఇటీవల పీజీ మెడికల్ ప్రవేశపరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడంతో ఎంసెట్‌కు పటిష్టమైన నిఘా అమలు పరుస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక నిఘా బృందాలను నియమించి అనుక్షణం విద్యార్థులను పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తెచ్చిన విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ఎంసెట్ కన్వీనర్ రమణారావు హెచ్చరించారు. ఎంసెట్ సరళిని పరిశీలించేందుకు హైదరాబాద్-జేఎన్‌టీయూ నుంచి ఇరువురు ప్రత్యేక పరిశీలకులు జిల్లాకు వచ్చారు.
ఏర్పాట్లు పూర్తి..
ఏఎన్‌యూ : ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం కాపీని తప్పకుండా వెంటతెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధృవీకరణ పత్రాల అటెస్టెడ్ జిరాక్సు కాపీలను వెంట తెచ్చుకోవాలి. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎంసెట్ రిజినల్ కో-ఆర్డినేటర్ ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో ఫైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారని చెప్పారు.