సంగారెడ్డి స్థానంపై తేల్చిచెప్పిన జగ్గారెడ్డి
Published Mon, Oct 14 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి దసరా పర్వదినం రోజున ఎన్నికల సమరానికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించి రాజకీయ సన్యాసంపై కొంత కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని చెక్ పెట్టారు. ‘కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తా’.. అని పేర్కొని పార్టీ మారనున్నారనే ప్రచారాన్ని సైతం తొసిపుచ్చే ప్రయత్నం చేశారు. దసరా వేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం ఆదివారం రాత్రి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో రావణాసురుడి దహనాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. వేలాది మంది సమక్షంలో జగ్గారెడ్డి ప్రసంగిస్తూ పై విధంగా మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలపై వాగ్దానాల జల్లు కురిపించారు. తన హాయాంలో చేపట్టిన అభివృద్ధిని ఉటంకిస్తూ చివర్లో పదేపదే ‘దటీజ్ జగ్గారెడ్డి’ అంటూ పంచ్ డైలాగులు విసురుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
అమరుల కుటుంబాల సీటు..ఉత్తిదేనా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర ప్రకటన వెల్లడైన తర్వాత జగ్గారెడ్డి రాజకీయ భవితవ్యంపై చర్చ జరిగింది. ఇంత కాలం తెలంగాణను వ్యతిరేకిస్తూ వచ్చిన జగ్గారెడ్డి ఇక క్రియా శీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, సంగారెడ్డి స్థానాన్ని అమర వీరుల కుటుంబాల నుంచి ఓ అభ్యర్థిని కాంగ్రెస్ తరఫున బరిలో నిలిపి గెలిపించుకోవాలని ఆయన అభిలషిస్తున్నారని కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) కథనాలూ వచ్చాయి. ఈ విషయంపై జగ్గారెడ్డి ఎక్కడా బహిరంగంగా ప్రకటన చేయకపోయినా ..సన్నిహితుల వద్ద ఉటంకించినట్లు ప్రచారం జరిగింది.
పజల నుంచి సానుభూతి కోసం జగ్గారెడ్డి లీకులిచ్చారని రాజకీయ ప్రత్యర్థులు దుమ్మెత్తిపోశారు. ఇంతకాలం ఈ ప్రచారంపై ఎలాంటి ప్రకటన చేయని జగ్గారెడ్డి నోటి నుంచి ‘మళ్లీ నేనే పోటీ చేస్తా’ననే మాట వెల్లడికావడంతో గమనిస్తే పథకం ప్రకారమే ఉత్తుత్తి ప్రచారం చేసుకున్నారని తెలుస్తోంది. జగ్గారెడ్డి ఇంతకాలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోడానికే తెలంగాణ అమరవీరుల పేర్లను వినియోగించుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన, ఇటీవలే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు మాట మార్చిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement