విజయనగరం కలెక్టరేట్ వద్ద కరోనా అలజడి -శంబర గ్రామ కరోనా బాధితులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న వైద్య సిబ్బంది
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరోనా మహమ్మారి జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల దగ్గరనుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల వరకూ చేరింది. ఇప్పటికే పోలీస్ శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిని తాకిన వైరస్.. తాజాగా రెవెన్యూశాఖలో ప్రవేశించింది. డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఈ నెల 21 వరకూ 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది కోలుకున్నారు. ఇంకా 83 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 21 కొత్త కేసులు వెలుగుచూశాయి. జిల్లా కేంద్రాస్పత్రి ఎదురుగా ఉన్న వెంకటేశ్వరరాయల్ అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కంటైన్మెంట్‌జోన్‌గా ప్రకటిస్తూ విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత ఉత్తర్వులు జారీచేశారు. ఆ అపార్ట్‌మెంట్ నుంచి 200 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్‌గాను, 400 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా ప్రకటించారు.
అపార్ట్‌మెంట్ నుంచి 200 మీటర్లలోపు ఉన్న ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని ప్రజలంతా గృహ నిర్భంధం పాటించాలని, మాస్‌్కలు, గ్లౌజ్‌లు తప్పనిసరిగా వినియోగించాలని, భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్‌గా నమోదైన వ్యక్తితో కాంటాక్ట్ అయిన వారు వెంటనే హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఆ ప్రాంతంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారన్నారు. కంటైన్మెంట్ జోన్ పరిధిలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ ప్రాంతంలోని ప్రజలంతా జాగ్రత్తగా, స్వీయ రక్షణలో ఉండాలని కోరారు. జిల్లాలో మొత్తం 40 కంటైన్మెంట్ క్లస్టర్‌లు ఏర్పాటు చేశారు.
అధికారులకు కరోనా పరీక్షలు
డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన టెలీ స్పందనకు జిల్లా అధికారులకు మినహాయింపు ఇచ్చా రు. కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించారు. జిల్లాలో కరోనాకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే నంబర్: 08922–236947ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
కొత్త కేసులు ఇలా...
బొండపల్లి మండలంలోని కొండకరకాం–1, నెల్లిమర్ల మండలంలోని కొండవెలగవాడ–1, డెంకాడ మండలం గొండయపాలెంలో–2, విజయనగరంలోని రాయల్ అపార్ట్‌మెంట్‌లో ఒక కేసు నమోదైంది. అలాగే... బొబ్బిలిలోని అల్లంవీధి, దేవలవీధి, నెయ్యలవీది, స్వామి వారి వీధుల్లో 7, బలిజిపేట మండలం చెకరపల్లిలో –2, జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి, గిజబ, చినమేరంగిలలో–3. గరుగుబిల్లిలో– 1, మెరకముడిదాం మండలం గుర్జవలసలో– 1, పార్వతీపురం బంగారం కాలనీలో–1, రామభద్రపురం మండలం ఆరికితోటలో ఒక కేసు నమోదైంది. కరోనా బాధితుల్లో తమిళనాడు నుంచి వచ్చిన వారు ఆరుగురు, ఢిల్లీ నుంచి ఇద్దరు, కేరళ నుంచి ఒకరు, విజయవాడ నుంచి వచ్చిన వారు ఆరుగురు ఉన్నారు.
శంబరలో కరోనా అలజడి
మక్కువ: మండలంలోని శంబర గ్రామంలో దంపతులిద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మండల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దంపతులిద్దరూ వలస కూలీలు. చెన్నైనుంచి వచ్చిన వీరు ఈనెల 19న రాత్రి జిల్లా కేంద్రాస్పత్రిలో కరోనా టెస్ట్‌లు చేయించుకున్నారు. మరుసటిరోజు 20న గ్రామానికి చేరుకున్నారు. అప్పటి నుంచి హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఇద్దరికీ పాజిటివ్‌గా నివేదికలు రావడంతో 108లో కోవిడ్ ఆస్పత్రి మిమ్స్‌కు తరలించారు.
13 మంది ప్రైమరీ కాంటాక్ట్...
చెన్నై నుంచి 8 మంది వలస కూలీలు ఈనెల 20న మండలానికి చేరుకున్నారు. వీరిలో శంబర గ్రామానికి చెందిన నలుగురు, బంగారువలసకు చెందిన మరో నలుగురు ఉన్నారు. సాలూరు పట్టణం నుంచి శంబర గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ వారిని ఇంటికి చేర్చారు. 8 మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌రాగా, మరో నలుగురికి నెగిటివ్ వచ్చింది. దంపతులతో కాంటాక్ట్ ఉన్న 13 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, సెకండరీ కాంటాక్ట్ ఉన్న సుమారు 100 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు వైద్యాధికారి సు«దీర్ తెలిపారు. గ్రామాన్ని ఎస్‌ఐ కే.రాజే‹Ù, ఎంపీడీవో సీహెచ్ సూర్యనారాయణ, తహసీల్దార్ డి.వీరభద్రరరావు పర్యటించి పారిశుద్ధ్య పనులు జరిపించారు. చెన్నై నుంచి బస్సులో శంబర గ్రామానికి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు నెగిటివ్ వచ్చినా... వారు శనివారం ఉపాధిహామీ పనులకు వెళ్లడంతో శంబర గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
బుధరాయవలసలో రెండో కేసు నమోదు..
మెరకముడిదాం: మండలంలోని బుధరాయవలస గ్రామంలో రెండో కరోనా కేసు నమోదైంది. విజయవాడ నుంచి ఈ నెల 19న గ్రామానికి చెరుకున్న 37 ఏళ్ల మహిళకు విజయనగరంలో కరోనా టెస్ట్‌లు చేశారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా వైద్య నివేదిక రావడంతో పంచాయతీ కార్యదర్శి గొర్లె రఘుబాబు, పోలీసులు, వైద్య సిబ్బంది 108లో విజయనగరం జేఎన్‌టీయూ కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
ఆవాలవలసలో...
సీతానగరం: చెన్నై నుంచి మండలంలోని బూర్జ పంచాయతీ ఆవాలవలసకు చేరుకున్న వలస కూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనను మిమ్స్‌కు తరలించారు. ఆ వ్యక్తి ఉపాధిహామీ పనులకు సైతం వెళ్లడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
ఆరికతోటలో మరో కేసు...
రామభద్రపురం: మండలంలోని ఆరికతోటలో 38 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. గతంలో ఆయన కోడలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమెను జిల్లా కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో హపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
స్వామి వారి వీధిలో అప్రమత్తం
బొబ్బిలి: స్థానిక స్వామి వారి వీధి నుంచి నిత్యం విజయనగరం వెళ్లి వచ్చే స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆమెను వైద్య పరీక్షల కోసం మిమ్స్‌కు తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్‌గా భర్త, కుమారుడు ఉన్నట్టు గుర్తించిన అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరికి మంగళవారం కరోనా పరీక్షలు చేయనున్నారు. మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో స్వామివారి వీధిలో పారిశుద్ధ్య పనులు జరిపారు. బజారులోని దుకాణాలను మూసివేయించారు.
Comments
Please login to add a commentAdd a comment