జీజీహెచ్‌లో అందుబాటులోకి రానున్న 24 గంటల ల్యాబ్
Published Fri, Apr 1 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM
కాకినాడ సిటీ : కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల ల్యాబ్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ఆసుపత్రి అధికార్లు ఇప్పటికే ల్యాబ్‌టెక్నీషియన్ సిబ్బందికి శిక్షణను పూర్తిచేశారు. ప్రస్తుతం ప్రారంభ సన్నాహాల్లో భాగంగా సిబ్బంది సేవలందించేందుకు డ్యూటీ రోస్టర్ల జాబితా రూపొందిస్తున్నారు. సేవలు ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రిలయన్స్ అందించిన రూ.80 లక్షలు సీఎస్‌ఆర్ నిధులతో జీజీహెచ్‌లో మల్టీస్పెషాల్టీ లేబొరేటరీని నిర్మించి అధునాతన ల్యాబ్ పరికరాలు సిద్ధం చేసినప్పటికీ గడిచిన సంవత్సర కాలంగా సేవలు వినియోగంలోకి రాలేదు.
జీజీహెచ్ ఉభయగోదావరి జిల్లాలకు ప్రధాన ఆస్పత్రి కావడంతో 24 గంటలూ అత్యవసర విభాగానికి వివిధ ప్రాంతాల నుంచి పాముకాటు బాధితులు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినవారు, వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారు వస్తుంటారు. మరోపక్క సుమారు 1500 మంది ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. సుమారు 3 వేలమంది ప్రతీరోజు ఔట్‌పేషెంట్లు ఉంటారు. అయితే రోజూ వైద్యులు ఇన్, ఔట్‌పేషెంట్లకు పెథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ విభాగాలకు సంబంధించి బ్లడ్‌సుగర్, యూరిన్ టెస్ట్, హిమోగ్లోబిన్, లివర్ ఫంక్షన్, థైరాయిడ్ వంటి టెస్ట్‌లు నాలుగు వందలకు పైబడి రాస్తుంటారు.
వీరందరూ మధ్యాహ్నం 12గంటల వరకు పనిచేసే ఆసుపత్రిలోని 7వ నంబర్‌లోని ల్యాబ్‌కు వెళ్లాలి. కాని అక్కడ రద్దీ, సమయం దాటిపోవడం వంటి కారణాలతో చేసేదిలేక అనేకమంది బయటి ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం నుంచి తెల్లారే వరకు అత్యవసర విభాగానికి వచ్చే క్షతగాత్రుల బంధువులకు కన్నీటి పరీక్షలు తప్పడం లేదు. రక్తపరీక్షకు కూడా బయటి ప్రైవేటుల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా ల్యాబ్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజుతున్నారు. ఈ పరిస్థితుల్లో 24గంటల ల్యాబ్ వినియోగంలోకి వస్తే ఇబ్బందులు తొలగుతాయి.
Advertisement
Advertisement