
250 మంది ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేత
ఎర్ర చందనం స్మగ్లర్లు భారీ సంఖ్యలో పట్టుబడ్డారు. మొత్తం 250 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు రేణిగుంట రైల్వేస్టేషన్ లో పట్టుబడ్డారు.
ఎర్ర చందనం స్మగ్లర్లు భారీ సంఖ్యలో పట్టుబడ్డారు. అడవుల్లోకి పెద్ద సంఖ్యలో వెళ్లి ఎర్ర చందనాన్ని తరలించి, అక్కడినుంచి తిరిగి వెళ్తున్న కూలీలను రేణిగుంట రైల్వేస్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ నుంచి భారీ సంఖ్యలో ఒకే ప్రాంతానికి చెందినవాళ్లు చెన్నై ఎక్స్ప్రెస్లో ఎక్కడంతో అక్కడి రైల్వే పోలీసులకు అనుమానం వచ్చింది. వాళ్లు వెంటనే తిరుపతి రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు.
రేణిగుంట స్టేషన్లో కాపు కాసిన పోలీసులు.. రైలు రాగానే ఆపి దాన్ని తనిఖీ చేయగా, మొత్తం 250 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీళ్లంతా శేషాచలం అడవుల్లో తమ పని ముగించుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్తున్నట్లు తెలిసింది. అందరూ ఒకే ప్రాంతం వారు కావడం, అంతా కలిసి గుంపుగా వెళ్లడంతో అనుమానం వచ్చి విచారించగా.. అందరూ స్మగర్లేనని తేలిపోయింది. వీరందరినీ టాస్క్ఫోర్స్ పోలీసులు తాత్కాలికంగా తిరుచానూరులోని కళ్యాణమండపంలో ఉంచారు. సోమవారంనాడు అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.