291వ రోజు పాదయాత్ర డైరీ | 291th day padayatra diary | Sakshi
Sakshi News home page

291వ రోజు పాదయాత్ర డైరీ

Published Tue, Oct 23 2018 3:41 AM | Last Updated on Tue, Oct 23 2018 7:58 AM

291th day padayatra diary - Sakshi

ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,193.6 కి.మీ
22–10–2018, సోమవారం 
సాలూరు, విజయనగరం జిల్లా 

నిత్యావసరాల ధరలు పెరిగింది మీ చర్యల వల్లే కదా బాబూ? 
ఈరోజు బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ప్రజాస్వామిక వ్యవస్థనే భ్రష్టుపట్టించిన చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి.. బొబ్బిలిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అమ్ముడుపోయారు. సాలూరులో గెలిచిన గిరిజన బిడ్డ మాత్రం విలువలనే విశ్వసించాడు.  

ఉదయం బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం రైతులు నన్ను కలిశారు. ఈ ప్రభుత్వం పెద్దగెడ్డ కాలువను నిర్లక్ష్యం చేయడంతో సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నామన్నారు. పిల్ల కాలువలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. ఉన్న కాలువ నిర్వహణను కూడా గాలికి వదిలేయడంతో నాలుగేళ్లుగా వేసిన పంటలు వేసినట్టుగా ఎండిపోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీరు–చెట్టు పథకం పేరుతో చేయని పనులకు సైతం బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న అధికారపక్ష నాయకులు.. ఉన్న కాలువల నిర్వహణకు కాసిన్ని నిధులు కూడా మంజూరు చేయకపోవడం దారుణం. ఇది రైతన్నల పాలిట శాపం.  

మిర్తివలస దగ్గర చిట్టిచెల్లెమ్మలు ‘జగనన్నా..’ అంటూ హుషారుగా పాటలు పాడుతూ కోలాటం ఆడారు. జెన్నివలసకు చెందిన హేమా వతి అనే చెల్లెమ్మ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆ కుటుంబం కిందామీదా పడి రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినా కుడి చెయ్యి మాత్రం ఇంకా చచ్చుబడిపోయే ఉంది. అయినా తనకొచ్చిన సమస్యకు తల్లడిల్లకుండా ఆ చెల్లెమ్మ ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. పారా ఒలింపిక్స్‌ పరుగు పందెంలో జాతీయ స్థాయిలో రాణించింది. ఆమె ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకం. ‘ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి.. నాకు వచ్చిన కష్టం మరొకరికి రాకుండా చూడ న్నా’ అంటూ ఆ చెల్లెమ్మ పెద్ద మనసుతో కోరింది. అభిమానానికి దూరాభారాలుండవు. లేకపోతే ఎక్కడి బొబ్బిలిలోని జెన్నివలస. ఎక్కడి ఇడుపులపాయ. జెన్నివలసకు చెందిన 90 ఏళ్ల సత్యవతమ్మకు నాన్నగారంటే అభిమానం. ఇడుపులపాయకు వెళ్లి.. నాన్నగారు శాశ్వత విశ్రాంతి పొందిన చోట మొక్కలకు నీళ్లు పోసుకుంటూ  నెల పాటు ఉందట. ఆ అవ్వ స్వచ్ఛమైన అభిమానానికి నా మనసంతా సంతోషంతో నిండిపోయింది.  

మధ్యాహ్నం శిబిరం వద్ద కొండకెంగువ గ్రామ యువకులు కలిశారు. తమ ఊరికున్న ఆరు కిలోమీటర్ల రోడ్డు పరిస్థితి దారుణాతిదారుణమని చెప్పారు. ఆ ఊరికి న్యూస్‌పేపర్లు రావు. అంబులెన్స్‌లు అడుగుపెట్టవు. విద్యార్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆరు నెలల క్రితం దండాసి మేరి అనే గర్భిణి.. 108 వాహనం రాకపోవడంతో ఆటోలోనే ఆస్పత్రికి బయలుదేరిందట. దారిలో కుదుపులకు పరిస్థితి విషమించి రక్తస్రావమై.. ప్రసవం కూడా జరిగిపోయిందట. పుట్టిన బిడ్డ పురిటిలోనే కన్నుమూసింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ.. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నప్పటికీ పాలక నేతలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై ఆ యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీకి, అక్రమ మైనింగ్‌ల కోసం రాత్రికిరాత్రే రోడ్లేసుకునే పచ్చ నేతలు.. సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడమన్నది అమానుషం.  

మధ్యాహ్నం సాలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించాను. ఆ పేరు వినగానే ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు గుర్తొస్తారు. మల్లె తోటలకూ సాలూరు  ప్రసిద్ధి. నాన్నగారు తలపెట్టిన జలయజ్ఞపు తొలి ఫలం పెద్దగెడ్డ రిజర్వాయర్‌ ఈ నియోజకవర్గంలోనే ఉంది. విజయవాడతో పోటీపడుతూ.. లారీ పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది సాలూరు. ఈ పరిశ్రమను ఆదుకుంటానని బాబుగారు హామీ ఇచ్చి మరిచారు. గతంలోనే పనులు మొదలుపెట్టిన ఆటోనగర్‌ ఆగిపోవడం ఆయనగారికున్న శ్రద్ధకు నిదర్శనం.

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్య ప్రజలు వాడే పెట్రోల్, డీజిల్‌పై అదనపు పన్నులు విధించి మొన్నటిదాకా దేశంలోనే అత్యధిక ధరలు వసూలు చేశారు. ఇప్పటికీ పెట్రోల్, డీజిల్‌ ధరలను అధికంగా వసూలు చేస్తున్న అగ్ర రాష్ట్రాల  జాబితాలో మీరూ ఉన్నారు. అదే సమయంలో ధనవంతులు ప్రయాణించే విమాన ఇంధనంపై మాత్రం అతి తక్కువ పన్ను విధించింది వాస్తవం కాదా? రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి.. పేద ప్రజలపై అధిక భారం పడటానికి మీ చర్యలు కారణం కాదా?   
-వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement